‘సంక్షేమ యాత్ర’ ఇప్పుడే ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో ‘సంక్షేమయాత్ర’ ఇప్పుడు ప్రారంభం అయిందని..రాబోయే రోజుల్లో ప్రజలకు సుపరిపాలన అందబోతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ తెలిపారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించటమే తమ ప్రభుత్వ ధ్వేయం అని..అందులో భాగంగానే సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో చెప్పిన అంశాలే సింహభాగం గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యంగా నవరత్నాలపై ఫోకస్ పెట్టడంతోపాటు..పాత టెండర్ల అక్రమాలపై విచారణ, జ్యుడిషియల్ కమిషన్ తో పారదర్శకంగా పనుల కేటాయింపు వంటి అంశాలపై ఫోకస్ పెట్టారు. ఏపీలో ప్రభుత్వం కొత్తగా కొలువుదీరటంతో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసగించారు. రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
2019 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సవాళ్లు అసంగతమైన నిర్వహణకు పర్యవసానాలుగా ఉన్నాయని, మానవ, భౌతిక వనరుల దుర్వినియోగపర్చడం రాష్ట్రం యొక్క దుస్థితిని మరింత తీవ్రతరం చేసిందని అభిప్రాయపడ్డారు. అవినీతి రహిత.. పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం ద్వారా పేర్కొన్నారు. ప్రజాధనం వృధాకాకుండా చర్యలు చేపట్టడంతో పాటు..అవసరం అయిన చోట రివర్స్ టెండరింగ్ కు వెళతామని అన్నారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తాం.
టెండర్లపై జ్యూడీషియల్ కమిషన్ వేస్తాం.. అవసరమైతే రివర్స్ టెండరింగ్ విధానం తెస్తాం.
ప్రజా సేవకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
విభజన హామీలను నెరవేర్చడం మా ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తాం.
గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం. గ్రామ వాలంటీర్లను ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం.
నవరత్నాలే మా ప్రభుత్వ ప్రాధాన్యత. నవరత్నాలను ప్రతి ఇంటికీ చేరుస్తాం.
రైతుల సంక్షేమమే మా లక్ష్యం. రైతు భరోసా కింద రూ.12,500 అందజేస్తాం. అక్టోబర్ నుంచి రైతు భరోసా అమలు. రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా బోర్లు వేయిస్తాం. వైఎస్సార్ బీమా కింద రూ.7 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. సహకార రంగాన్ని, పాడి పరిశ్రమ రంగాలను బలోపేతం చేస్తాం.
జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ కాలపరిమితిలో పూర్తి చేస్తాం. కిడ్నీ, తలసేమియ రోగులకు రూ. 10 వేల పెన్షన్ అందజేస్తున్నాం.
మద్యపానాన్ని దశలవారిగా నిషేధిస్తాం.
అమ్మఒడి కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందిస్తాం.
నామినేటెడ్ పనులను బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు కేటాయిస్తాం.
కాపుల అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయిస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టుల అభివృద్ధి కట్టుబడి ఉన్నాం.
పెన్షనర్ల వయస్సును 65 నుంచి 60 కుదిస్తున్నాం.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు కేటాయిస్తాం.
ప్రత్యేకహోదా కోసం మా పోరాటం కొనసాగిస్తాం.
సీపీఎస్ రద్దు కోసం కమిటీ ఏర్పాటు చేశాం.
ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ అందజేస్తాం.
సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి పేద విద్యార్థి మొత్తం ఫీజును మేమే భరిస్తాం.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అదనంగా విద్యార్థి బోర్డింగ్ వసతి కోసం ఏడాదికి రూ. 20 వేలు సమకూరుస్తాం.
వైఎస్సార్ చేయుత ద్వారా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తాం.
గిరిజిన సంక్షేమశాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచాం.