Telugu Gateway
Politics

రాహుల్ కోసం ఉత్తమ్ రాజీనామా చేయరా?

రాహుల్ కోసం ఉత్తమ్ రాజీనామా చేయరా?
X

రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల రాజీనామాల పర్వం కొసాగుతోంది. తెలంగాణలోనూ అదే జోరు కొనసాగుతోంది. తొలుత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత మరో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంతరావులు తన పదవులకు రాజీనామా చేశారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాజీనామా అంశంపై మౌనంగా ఉంటున్నారు. గత కొంత కాలంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగించాల్సిందిగా ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. అందరూ రాహుల్ కు సంఘీభావంగా రాజీనామాలు చేస్తున్నారు కానీ..ఉత్తమ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఈ వ్యవహారం కూడా పార్టీలో ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలను మారిస్తే తప్ప తెలంగాణ కాంగ్రెస్ లో మార్పులు రావటం కష్టం అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపడతారో లేదో తెలియదు కానీ..దేశ వ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన చేయటానికి రెడీపోయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే తన పదవికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అందరూ రాజీనామాల బాట పట్టడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. మరి ఆయన ఒత్తిడి పట్టించుకుంటారా? లేక అధిష్టానం నిర్ణయం తీసుకునే వరకూ అంతే ఉంటారా?. వేచిచూడాల్సిందే. అంతా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు తీరిగ్గా ఉద్యమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Next Story
Share it