Telugu Gateway
Telangana

పోలీసుల ముందుకు ర‌విప్ర‌కాష్

పోలీసుల ముందుకు ర‌విప్ర‌కాష్
X

గ‌త కొంత కాలంగా త‌ప్పించుకు తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. సుప్రీంకోర్టులో కూడా ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించ‌క‌పోవ‌టంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆయ‌న అజ్ణాతం వీడిన‌ట్లు కన్పిస్తోంది. శ్రీనిరాజు టీవీ9లో మెజారిటీ వాటాల‌ను విక్ర‌యించ‌టం..వీటిని అలంద మీడియా కొనుగోలు చేసిన‌ప్ప‌టి నుంచి టీవీ9 వివాదం న‌డుస్తూనే ఉంది. కొంత కాలం అంత‌ర్గ‌తంగా సాగిన వివాదం..చివ‌ర‌కు కేసుల వ‌ర‌కూ రావటంతో అంతా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వివాదం తీవ్ర‌రూపం దాల్చ‌టం..ర‌విప్ర‌కాష్ పై కొత్త యాజ‌మాన్యం ప‌లు కేసులు న‌మోదు చేయ‌టం..త‌ర్వాత ర‌విప్ర‌కాష్ వీడియోల ద్వారా స్పందించి..త‌న‌నే మోసం చేశార‌ని ఆరోపించ‌టం తెలిసిందే. ఊహించిన‌ట్లుగానే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మంగ‌ళ‌వారం నాడు సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయ‌న‌పై ప్ర‌స్తుతం ఫోర్జరీ, డేటా చౌర్యం పై అభియోగాలు మోపారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్ ప‌లు ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అవేమీ ఫ‌లించ‌లేదు.

అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్‌పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కావడంపై సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాసరావు స్పందించారు. ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలపై రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. రవిప్రకాశ్‌ చెప్పేదాన్ని బట్టి ఎన్ని రోజులు విచారణ చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో అతన్ని ప్రశ్నిస్తామని వెల్లడించారు.పోలీసులు 41 ఏ కింద నోటీసులు జారీ చేసినందున త‌ప్ప‌నిస‌రిగా పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని సుప్రీంకోర్టు ర‌విప్ర‌కాష్ కు సూచించింది. అదే స‌మ‌యంలో ఆయ‌న అప్పీల్ పై మెరిట్ ఆధారంగా ఈ నెల‌10న విచారించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ర‌విప్ర‌కాష్ నివాసంతో పాటు టీవీ9 కార్యాల‌యంలోని ఆయ‌న గ‌దిలో సోదాలు నిర్వ‌హించి ప‌లు డాక్యుమెంట్లు సేక‌రించారు.

Next Story
Share it