గోవిందా...ఆ టీటీడీ జెఈవోను మార్చలేవా!
శ్రీనివాసరాజు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జెఈవో. అదే పదవిలో ఎనిమిదేళ్ళు దాటిపోయింది. ప్రభుత్వాలు పోతున్నాయి..వస్తున్నాయి. కానీ ఆయన మాత్రం అక్కడ నుంచి మారటం లేదు. చూస్తుంటే ఆ వెంకటేశ్వరస్వామి కూడా శ్రీనివాసరాజును అక్కడ నుంచి మార్చలేరా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి. తాజాగా నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా 50 మందికిపైగా ఐఏఎస్ లను బదిలీ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు సర్కారుతో అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి ఇంకా పోస్టింగ్ లు కూడా ఇవ్వకుండా పక్కనపెట్టారు. జెఈవో శ్రీనివాసరాజు తిరుమల కొండపైనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు. ఐదేళ్ల టీడీపీ పాలన చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు. జెఈవో శ్రీనివాసరాజు వ్యవహారశైలిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు ఆయన్ను అక్కడ నుంచి కదిలించలేకపోయింది. కారణం ఓ సారి ఏమో దేశంలోనే అత్యంత శక్తివంతమైన పారిశ్రామికవేత్త సిఫారసు. మరో సారి ఏమో సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి సిఫారసుతో శ్రీనివాసరాజు బదిలీ ఆగిపోయిందని అధికారులు చెబుతున్న సమాచారం.
ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు సీఎస్ గా ఎల్వీ సుబ్రమణ్యం వచ్చిన కొద్దిరోజుల కే శ్రీనివాసరాజు సెలవు పెట్టి వెళ్ళారు. మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఆయన నిశ్చింతగా కొండపై స్వామివారి సేవలో కొనసాగుతున్నారు. ఎంతో కీలకం అయిన పోస్టింగ్ ల్లో ఏ ఉన్నతాధికారిని మూడేళ్లకు మించి ఉంచరు. కానీ ఎంత పరపతి..పైరవీలు ఉపయోగిస్తే శ్రీనివాసరాజు ఎనిమిదేళ్ళకు పైగా ఆ పదవిలో కొనసాగగలరు?. మరి తదుపరి జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసే బదిలీల్లో అయినా శ్రీనివాసరాజు బదిలీ ఉంటుందా? లేదా అన్నది ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఏమి జరుగుతుందో?.