Telugu Gateway
Andhra Pradesh

ఆ ఎంపీలు ఇక బిజెపి సభ్యులే..వెంకయ్యనాయుడు గ్రీన్ సిగ్నల్

ఆ ఎంపీలు ఇక బిజెపి సభ్యులే..వెంకయ్యనాయుడు గ్రీన్ సిగ్నల్
X

ఇక సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు బిజెపి ఎంపీలే. రాజ్యసభ వెబ్ సైట్ కూడా ఇదే విషయం చెబుతోంది. బిజెపిలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేస్తూ ఆ పార్టీ నేతలు ఇఛ్చిన లేఖను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. ఈ విలీనానికి సమ్మతిస్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా వెంటనే లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కూడా వెంటనే నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యుల చేరికతో రాజ్యసభలో బిజెపి సంఖ్యాబలం 75కి చేరినట్లు అయింది. ఫిరాయింపులపై బహిరంగంగా తన అభిప్రాయాలు వెల్లడిచేసిన వెంకయ్యనాయుడు అత్యంత వివాదస్పదం అయిన ఈ విలీనంపై ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకోవటం విమర్శలకు గురవుతోంది.

పార్టీ మారిన వారి సభ్యత్వాల వెంటనే రద్దు అయ్యేలా చట్టం తేవాలని ఈ మధ్యే వెంకయ్యానాయుడు కోరారు. పార్లమెంటరీ పార్టీ, పార్టీ అధినేత ఆమోదం లేకుండా అసలు సమావేశం ఎక్కడ పెట్టారు?. ఎప్పుడు పెట్టారు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా విలీనం చెల్లదని..ఇది పూర్తిగా ఫిరాయింపుల కిందకే వస్తుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వాదించారు. దీనిపై తాము ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అయినా సరే వెంకయ్యనాయుడు మాత్రం తన నిర్ణయం తాను తీసుకున్నారు.

Next Story
Share it