Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ నేతల గగ్గోలు..అవినీతి అంటిస్తే అంటుకుంటదా?!

టీడీపీ నేతల గగ్గోలు..అవినీతి అంటిస్తే అంటుకుంటదా?!
X

అవినీతి అంటిస్తే అంటుకుంటదా..ఆధారాలు ఉంటే అంటుకుందా?. ఎందుకు తెలుగుదేశం నేతలంతా ఒక్కసారిగా గగ్గోలు పెడుతున్నారు?. ఐదేళ్ళ చంద్రబాబు పాలన ఓ స్వర్ణయుగం అయితే..ఎలాంటి అక్రమాలు చేయకపోతే ఎందుకీ గగ్గోలు. నిజంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం వేస్తే ఏమి అవుతుంది. చంద్రబాబు, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు అండ్ కో ఎవరూ ఏమీ చేయకపోతే అసలు టెన్షన్ ఎందుకు పడాలి?. రాజకీయంగా వైసీపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలుండొచ్చు. కానీ ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి అంత ఈజీగా ఉండదు. మంత్రుల కమిటీ ఫైళ్ళు చూడాలి..అధికారులు అక్రమాలను నిగ్గుతేల్చాలి. ఆధారాలు లేకుండానే ఎవరైనా..ఎవరికైనా అవినీతి అంటించగలరా?. ఆ ఆధారాలు ప్రజలు ముందు పెడితే తెలిసిపోతుంది కదా?. స్విస్ ఛాలెంజ్, భోగాపురం విమానాశ్రయం, రాజధాని టెండర్ల గోల్ మాల్, నీరు-చెట్టు, సాగునీటి ప్రాజెక్టులు, ఐటి పేరిట సాగిన లూటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు.

నిజంగా చంద్రబాబుకు అయినా..నారా లోకేష్..ఇతర మంత్రులకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమి చేశారో తెలియదా?. ఫైళ్ళలో నిధులు ఎక్కడెక్కడికి..ఎప్పుడెప్పుడు ఎంత వెళ్ళాయో ఉండదా?. ప్రభుత్వంలో ప్రతిదానికీ ఓ లెక్క ఉంటుంది కదా?. యనమల రామకృష్ణుడు అయితే తమది స్వర్ణయుగం (ఎవరికో) అని చెప్పుకుంటున్నారు?. మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా జగన్ సర్కారు తమకు అవినీతిని అంటించే ప్రయత్నం చేస్తోందని బాధపడుతున్నారు. మరో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ దీ అదే వరస. ‘అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌!. మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది.’ అంటూ ట్వీట్ చేశారు.

అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను ఏ మాత్రం పట్టుకోలేదని ధీమాతో ఉన్న వారు ఒక్క నిర్ణయంతోనే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు లెక్కతేల్చారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలు..ఐటి, రాజధాని ఇలా ఎన్నో అంశాల్లో వివరాలు బయటకు రావాల్సి ఉంది. అక్రమాలకు ఆధారాలు ఉన్నా కూడా ‘అంటించారు’ అనే అంటారా? తెలుగుదేశం నేతలు. మొత్తానికి ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మాత్రం టీడీపీలో కలకలం రేపుతోంది. ఆ పార్టీ నేతల రియాక్షన్స్ చూస్తుంటేనే విషయం తెలిసిపోతుంది.

Next Story
Share it