‘ఆ నలుగురి’పై వేటు వేయాల్సిందే

పార్టీ మారిన రాజ్యసభ సభ్యులపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ అందజేసింది. బిజెపిలో చేరిన నలుగురు ఎంపీలపై వేటు వేయాల్సిందేనని కోరింది. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం చెల్లదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతా రామలక్ష్మి, ఎంపీలు గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని తదితరులు ఉప రాష్ట్రపతిని కలిశారు.
విలీనం అంశాన్ని తప్పుబట్టిన వారు ....పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాము విలీనం కోరుతూ ఎలాంటి తీర‍్మానం చేయలేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. మరోవైపు పార్టీ మారిన ఎంపీలు బీజేపీ సభ్యులే అంటూ రాజ్యసభ వెబ్‌సైట్‌లో అధికారికంగా పేర్కొన్న విషయం విదితమే.