Telugu Gateway
Andhra Pradesh

బిజెపిలో చేరగానే సుజనా..సీఎం రమేష్ పునీతులైనట్లేనా?!

బిజెపిలో చేరగానే సుజనా..సీఎం రమేష్ పునీతులైనట్లేనా?!
X

సీఎం రమేష్..ఇక ఇఫ్పుడు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావుకు జాన్ జిగ్రీ దోస్త్ అయిపోతారా?. రాజ్యసభ సభ్యులైన వీరిద్దరూ ఎన్నికల ముందు టీవీ డిబేట్లలో తిట్టుకున్న తిట్లు..వ్యవహరించిన తీరు ఇంకా తెలుగు ప్రజల్లో చెవుల్లో మారుమోగుతూనే ఉంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో అసలు టీడీపీకి మాట్లాడే నైతిక అర్హతే లేదు. ఎందుకంటే అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ పార్టీ ఇప్పుడు ఫిరాయింపులపై విమర్శలు చేయటం అంటే విడ్డూరమే అవుతుంది. అయితే జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా టీడీపీ, టీఆర్ఎస్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ ఫిరాయింపులకు తెరలేపిందనే చెప్పొచ్చు. సీఎం రమేష్ ఎన్నో అక్రమాలు చేశారని..ఐటి ఎగ్గొట్టారని బిజెపి నేతలు ఎన్నో విమర్శలు చేశారు. ఐటి దాడుల విషయంలో బిజెపి నేతలు సీఎం రమేష్ పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కానీ సడన్ గా ఇప్పుడు అదే సీఎం రమేష్ ను బిజెపి తమ పార్టీలోకి కండువా కప్పి మరీ ఆహ్వానించింది. దీంతో సీఎం రమేష్ పూర్తిగా పునీతుడుగా మారిపోయినట్లేనా?. ఇక ఐటి ఎగ్గొట్టడం..అక్రమాలు అన్నీ సక్రమం అయినట్లేనా?. లేక ఆ కేసులు అలా కొనసాగుతాయా? అన్నది వేచిచూడాల్సిందే.

మరో ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై ఉన్నన్ని ఆరోపణలు కూడా అన్నీ ఇన్నీ కావు. ఈ మధ్య కాలంలో ఆయన ఈడీ, సీబీఐ విచారణలకు ఆహ్వానాలు అందుకున్నారు. మరి ఇప్పుడు సుజనా చౌదరి బిజెపిలో చేరగానే ఆరోపణలు అన్నీ మాయం అయిపోయినట్లేనా?. ఈ విషయంలో సీఎం రమేష్, సుజనా చౌదరిల కంటే బిజెపినే ఎక్కువ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇక మరో ఎంపీ టీ జీ వెంకటేష్ ‘ప్రజాభిప్రాయం’ ప్రకారం పార్టీ మారామని చెప్పటం విశేషం. అసలు ఆయనకు ప్రజలు ఏ రూపంలో అభిప్రాయం చెప్పారో ఆయనకే తెలియాలి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న గరికపాటి మోహన్ రావు కూడా టీడీపీకి ఝలక్ ఇవ్వటం ఆసక్తికర పరిణామంగా మారింది. సీఎం రమేష్, సుజనా చౌదరిలపై కావాలనే కేంద్రం ఈడీ, ఐటిలతో దాడులు చేయించిందని సాక్ష్యాత్తూ చంద్రబాబునాయుడు ఆరోపించారు. సీఎం రమేష్ కూడా పదే పదే ఇదే విమర్శలు చేశారు. మరి టార్గెట్ గా దాడులు చేసిన పార్టీలో మరి ఏ ఉద్దేశంతో చేరుతున్నట్లు?. చేసిన దాడుల నుంచి రక్షణ పొందేందుకా?.

Next Story
Share it