Telugu Gateway
Andhra Pradesh

సుజనా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సుజనా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చిక్కుల్లో పడటం ఖాయంగానే కన్పిస్తోంది. విచారణ సంస్థలు స్పీడ్ పెంచటంతో ఆయన కు తిప్పలు తప్పవనే అభిప్రాయం పార్టీ నేతల్లో కూడా వ్యక్తం అవుతోంది. కేంద్రంలో మోడీ సర్కారు తిరిగి అధికారంలోకి వచ్చాక అక్రమార్కులపై కఠిన చర్యలకు సిద్ధం అవుతోంది. సుజనా చౌదరి వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే శనివారం నాడు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సూజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. ఉదయం 8 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 11 గంటలకు ముగిశాయి.

బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో సీబీఐ అధికారులతోపాటు బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ సెల్‌ టీం సభ్యులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి పొందిన నిధులను ఇతర మార్గాల్లో డొల్ల కంపెనీలకు తరలించినట్లు సుజనా చౌదరిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో మనీలాండరింగ్‌ కింద ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా జరిగిన దాడులు మాత్రం సీబీఐ ఇటీవల సుజనాపై నమోదు చేసిన మరో కేసుకు సంబంధించినవి కావడం గమనార్హం. ఇందుకు సంబంధించి నలుగురు డైరెక్టర్లు శ్రీనివాస కల్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ వర్మను అదుపులోకి తీసుకొని విచారించారు.

Next Story
Share it