Telugu Gateway
Politics

లోక్ సభలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు సోనియాకు

లోక్ సభలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు సోనియాకు
X

సోనియాగాంధీ మళ్ళీ సీన్ లోకి వచ్చారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష పార్టీ నేతగా ఆమె వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ బాధ్యతలు తీసుకోవటానికి ఏ మాత్రం ఆసక్తిచూపలేదు. దీంతో సోనియాగాంధీనే ఈ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. 52 మంది ఎంపీలతోనే అధికార బిజెపిపై పోరాటం చేస్తామని సోనియా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం.. ఆ ఓటమి బాధ్యతతో రాజీనామాకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుబడుతుండటంతో శనివారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీపీపీ నాయకుడిగా రాహుల్‌ గాంధీని ఎన్నుకుంటారని మొదట భావించారు. రాహుల్‌ రాజీనామాకు పట్టుబడుతున్న నేపథ్యంలో మళ్లీ సోనియా గాంధీ శరణ్యమని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. సీపీపీ సమావేశంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ పేరును ప్రతిపాదించగా...ఇందుకు పార్టీ ఎంపీలు ఆమోదం తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగబోనని రాహుల్‌ గాంధీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన సీపీపీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశానికి లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ సభ్యులు, 50మంది రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు కావాలి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా సోనియాగాంధీ ఎన్నికైన నేపథ్యంలో ఆమెకు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

Next Story
Share it