తొలగించే ముందు తప్పుకున్న పుట్టా సుధాకర్ యాదవ్
ఏపీలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారినా ఇంత కాలం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
గత ప్రభుత్వం తమను నియమించిందని..తాము సంప్రదాయబద్దంగా ప్రమాణ స్వీకారం చేశామని..ప్రభుత్వం తప్పిస్తే తప్ప తమంతట తాము రాజీనామా చేయలేమని సుధాకర్ యాదవ్ ఇంత కాలం వాదిస్తూ వచ్చారు. ఇక నేడో..రేపో ఆర్డినెన్స్ ద్వారా బోర్డును రద్దు చేసేందుకు సర్కారు సన్నాహాలు చే్స్తున్న తరుణంలో పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవి నుంచి వైదొలిగారు. ఈ పదవిని మాజీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డికి కేటాయించాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది.