చంద్రబాబుకు మరో షాక్
జగన్ సర్కారు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి షాక్ ఇచ్చింది. ఆయన నివాసంలో ఉన్న ప్రజా వేదికను సర్కారు స్వాధీనం చేసుకున్నట్లు అయింది. శుక్రవారం నాడు సీఆర్ డీఏ అధికారులు ప్రజావేదికను సందర్శించి కలెక్టర్ల సమావేశం ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం ప్రజావేదికను తనకు కేటాయించాలని కోరుతూ సీఎం జగన్ కు చంద్రబాబునాయుడు లేఖ రాశారు. వైసీపీ నేతలు కేటాయింపు సాధ్యంకాదని స్పష్టమైన సంకేతాలు ఇఫ్పటికే పంపారు.
అయితే ఈ నెల24న జరగనున్న కలెక్టర్ల సమావేశం ఇందులో జరపాలని సర్కారు నిర్ణయించటంతో మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. సీఆర్ డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్ ప్రజావేదికను పరిశీలించారు. కలెక్టర్ల సమావేశం వేదిక సచివాలయం నుంచి కరకట్ట రోడ్డులోని ప్రజావేదికకు మారిందని సర్కారు తెలిపింది. దీంతో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు అయింది. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రైవేట్ ప్రాపర్టీలోనే ఈ ప్రజావేదిక ఉండటం. మరి ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.