Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు ‘పోలవరం అంచనాల పెంపు సంకటం’!

జగన్ కు ‘పోలవరం అంచనాల పెంపు సంకటం’!
X

పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద సంకటంగా మారనుందా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి..అక్రమాల కోసమే చంద్రబాబు సర్కారు పోలవరం అంచనాలను అడ్డగోలుగా పెంచిందని ఆరోపించారు వైసీపీ నేతలు. చంద్రబాబు సర్కారు తొలుత పోలవరం అంచనా వ్యయాన్ని 57,940 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఈ అంచనా వ్యయం పెంపు జీవో జారీ చేసేనాటికి మాత్రం 55,548.87 కోట్ల రూపాయలకు తగ్గించారు. ఈ మేరకు అప్పటి సాగునీటి శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో 21 జారీ చేశారు. తొలి అంచనాలకు..జీవోలో పేర్కొన్న మొత్తానికి 2392 కోట్ల రూపాయల తేడా ఉంది. అయితే అంచనాల పెంపు జీవో జారీని కూడా వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టడమే అని పేర్కొంది.

విచిత్రం ఏమిటంటే తాజాగా కేంద్రం పోలవరానికి సంబంధించి పెంచిన 55,548 కోట్ల రూపాయల అంచనాకు ఆమోదం తెలిపింది. చంద్రబాబు సర్కారు ఏ జీవో అయితే జారీ చేసిందో అదే జీవోలో పేర్కొన్న మొత్తానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, బిజెపి నేతలు ఆరోపించినట్లు అంచనాల పెంపులో అక్రమాలు ఉంటే కేంద్రం ఎందుకు ఆమోదించినట్లు?. అంటే చంద్రబాబు చేసిన అక్రమాలను వైసీపీ సర్కారు కూడా కొనసాగిస్తుందా?. లేదు కేంద్రంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి పోలవరం అంచనా వ్యయంలో అవకతవకలు జరిగాయి..వాస్తవ అంచనాలు ఇవి అని ఏమైనా నూతన మార్పులకు ప్రతిపాదిస్తుందా?. ఇది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. అక్రమాలు..అవినీతి ఉన్నప్పుడు చంద్రబాబు పంపిన అంచనాలను కేంద్రం ఎలా ఆమోదించింది?. అన్నదే ఇప్పుడు ప్రశ్న. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి కూడా ఈ వ్యవహారంపై ట్వీట్ ద్వారా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసినపుడు పోలవరం అంచనాల పెంపునకు ఆమోదం తెలపాలని కోరారని..అందుకు స్పందనగానే రూ.55,548కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్‌ వచ్చిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇది తన తండ్రి చంద్రబాబు కష్టానికి ఫలితమని లోకేష్‌ డప్పుకొట్టుకోవటం ఆపాలని ఆయన అన్నారు. ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీదంని ఆయన ఎద్దేవ చేశారు. అయితే చంద్రబాబు సర్కారు అంచనాలు దోపిడీ కోసం అని చెప్పిన వైసీపీ నేతలు....ఇప్పుడు అవే అంచనాలను యధాతధంగా ఆమోదించాలని కోరటం వెనక మతలబు ఏమిటి?. పైగా జగన్ మోడీని అడగటం వల్లే దీనికి మోక్షం లబించిందని చెప్పుకోవటం ఎలా జస్టిఫై చేసుకోగలుగుతారు?. మొత్తానికి పోలవరం వ్యవహారంలో చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను జగన్ ఏ మేరకు రుజువు చేయగలరో తెలియదు కానీ..ఈ అంచనాల పెంపు వ్యవహారం మాత్రం జగన్ సర్కారును ఇరకాటంలోకి నెట్టడం ఖాయంగా కన్పిస్తోందని చెబుతున్నారు.

Next Story
Share it