Telugu Gateway
Andhra Pradesh

ప్రత్యేక హోదాపై కేంద్రానిది మళ్ళీ అదే మాట

ప్రత్యేక హోదాపై కేంద్రానిది మళ్ళీ అదే మాట
X

దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇఛ్చే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం తేల్చిచెప్పారు. బీహార్ కు చెందిన ఎంపీ కౌసలేంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు ఇఛ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు బీహార్, జార్ఖండ్, చత్తీస్ గడ్, ఒరిస్సా, రాజస్థాన్ లు ప్రత్యేక హోదా కోరాయని ఆమె తెలిపారు. ప్రణాళికా మద్దతు కోసమే ప్రత్యేక హోదాకు గతంలో సిఫారసులు చేసేవారని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక హోదాకు..పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని ప్రకటించారు. ఈ తరుణంలో నిర్మలా సీతారామన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీని కలసిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిజెపిలు కూడా భేషరతు మద్దతు ప్రకటించాయి.

కానీ అధికారంలోకి వచ్చాక బిజెపి ఏపీ ప్రత్యేక హోదా హామీని అటకెక్కించింది. ఇటీవల వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదాపై పలుమార్లు మాట మార్చి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంలో బిజెపికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున బతిమాలటం తప్ప ఏమీ చేయలేమంటూ ప్రకటించారు. తాజాగా నీతి అయోగ్ సమావేశంతోపాటు..అఖిలపక్ష భేటీలోనూ జగన్ తన ప్రత్యేక హోదా వాదనను అయితే విన్పించారు. మరి కేంద్రం ఇదే వైఖరి కట్టుబడి ఉంటుందా? లేక రాబోయే రోజుల్లో అయినా హోదా ఇవ్వటం లేదు కాబ్టటి ‘ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు’ ఏమైనా ప్రకటిస్తుందా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it