Telugu Gateway
Politics

నాలుగు వందల కోట్లతో సచివాలయం..వంద కోట్లతో అసెంబ్లీ

నాలుగు వందల కోట్లతో సచివాలయం..వంద కోట్లతో అసెంబ్లీ
X

తెలంగాణలో కొత్త సచివాలయం..కొత్త అసెంబ్లీ భవనాలు రానున్నాయి. నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన సచివాలయం, వంద కోట్ల రూపాయల వ్యయంతో అసెంబ్లీ నిర్మించనున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే నిర్మిస్తారు. అయితే సచివాలయంలోని అన్ని భవనాలు కూల్చివేయాలా? లేదా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నూతన అసెంబ్లీ మాత్రం ఎర్రమంజిల్ లో నిర్మించనున్నారు. పార్లమెంట్ తరహాలో నూతన అసెంబ్లీ ఉంటుందని ముఖ్యమంత్రి కెసీఆర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివరాలను ఆయనే స్వయంగా మీడియాకు వివరించారు. ఈ నెల 27న సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అయితే ఉద్యోగులు ఎంతగానే ఆసక్తిచూసిన ఐఆర్, పదవి విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై నిర్ణయాన్ని తదుపరి కేబినెట్ కు వాయిదా వేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో గతంలో చాలా వివాదాలు ఉండేవని.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరిగాయని కేసీఆర్‌ అన్నారు. ఏపీతో స్నేహబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21 ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు. పక్క రాష్ట్రమైన ఏపీతో గోదావరి, కృష్ణా జలాల్లో వివాదాలు ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు. ప్రజలకు సాగునీరు అందించాలనే ధృడ సంకల్పంతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఏపీ భవనాలను తెలంగాణకు ఇవ్వడానికి ఆ రాష్ట్ర ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలను సాగు నీరు అందుతుందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కరకట్టల నిర్మాణాలు పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సహాకారంతోనే కాళేశ్వరం పనులు వేగంగా జరిగాయన్నారు.

పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తామని సమావేశం అనంతరం సీఎం వెల్లడించారు. ఈనెల 28న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ అధికారుల సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణలోని 22 జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించియింది. కొత్త మున్సిపల్‌ చట్టానికి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కోకాపేటలో శారదా పీఠానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. డైరక్టర్ శంకర్ కు మోకిల్లాలో ఐదు ఎకరాల స్థలాన్ని ఎకరా ఐదు లక్షల రూపాయలకు కేటాయించటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్కడ స్టూడియో నిర్మిస్తారని తెలిపారు.

Next Story
Share it