ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు
కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో విలీనంలో భాగస్వాములు అయిన వారికి నియోజకవర్గాల్లో సమస్యలు వస్తున్నాయా?. నియోజకవర్గాల్లో కూడా వారు తిరగలేకపోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అందుకే ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సర్కారు భద్రత పెంచింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలకు ఇంటెలిజెన్స్ సెక్యురిటీ విభాగం అదనపు భద్రత కల్పించింది.
నియోజకవర్గాలలో తిరుగలేకపోతున్నామని భద్రత పెంచాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరడంతో 4 ప్లస్ 4 గన్‌మెన్లను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వీరిద్దరూ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్‌రెడ్డి పార్టీ మారిన తర్వాత ఈ నెల 6న టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనమైన విషయం తెలిసిందే. ఈ విలీన వ్యవహారంపై హైకోర్టులో కేసు సాగుతోంది.