అందుకే నాకు మంత్రి పదవి రాలేదు

వైసీపీ ఎమ్మెల్యేకు రోజాకు సంబంధించి సోమవారం నాడుమీడియాలో పెద్ద హంగామానే జరిగింది. సీఎం జగన్ ఆమెకు ఫోన్ చేసి పిలిపించారని..అమరావతి వచ్చి ఆమె జగన్ ను కలవబోతున్నారంటూ హంగామా చేశారు. అయితే అమరావతికి వచ్చిన రోజా మాత్రం తనకు ఎవరూ ఫోన్ చేయలేదని.అసెంబ్లీ సమావేశాలు ఉన్నందునే వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. తనను ఎవరూ అమరావతికి రావాలని పిలవలేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు. సోమవారం విజయవాడకు వచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అమరావతికి వచ్చానని స్పష్టం చేశారు. మంత్రి పదవి దక్కలేదని తనకు ఏమాత్రం బాధలేదన్నారు. కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు తాను అలిగానని వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తాను కులాలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికి రోజా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఓవైపు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పుపై ప్రశంసలు వస్తున్నా..రోజా విషయంలోమాత్రం చాలా మంది మాత్రం ఆమెకు అన్యాయం జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.