అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశం

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్ ఏదైనా ఉంది అంటే..అది మంగళగిరే. ఎందుకంటే అక్కడ పోటీచేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, అప్పటి మంత్రి నారా లోకేష్. కానీ ఆయన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో అత్యధిక బెట్టింగ్ లు కూడా మంగళగిరిపైనే జరిగాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలు ముగిసి..అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత మంగళవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
తొలిసారి లాబీల్లో మాజీ మంత్రి లోకేష్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎదురుపడ్డారు. ఈ తరుణంలో నారా లోకేష్, ఆళ్ళ రామకృష్ణారెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి..కంగ్రాట్స్ చెప్పారు. తనను అభినందించిన లోకేశ్‌కు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ ఇలా మాట్లాడుకోవటం లాబీల్లో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది. సోమవారం నాడు తొలిసారి మండలిలోకి అడుగుపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ లు కూడా పరస్పరం అభివాదం చేసుకున్న విషయం తెలిసిందే.