Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ప్రత్యేక హోదా కేసులు ఎత్తేయండి

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండవ రోజు ఎస్పీలతో సమావేశం అయిన సందర్భంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిపై నమోదు అయిన కేసులను ఎత్తేయాలని జగన్  ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. ‘ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటివారైనా సహించవద్దు. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్‌ ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి. గత సీఎం నివాసం సమీపంలో ఇసుక మాఫియా సాగింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దోపిడీ అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై ఓ ప్రజాప్రతినిధి జుట్టు పట్టుకుని దాడి చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ల ఎదుటే జరిగాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది సరైన విధానమేనా? గుంటూరు జిల్లాలో అక్రమమైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భూ సమీకరణ పేరుతో పోలాలు ఇవ్వని రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఎమ్మెల్యేలే బహిరంగంగా దందాలకు పాల్పడ్డారు.

- Advertisement -

గ్యాంబ్లింగ్‌, పేకాట క్లబ్‌లకు ఎమ్మెల్యేలు సహకరించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు లేకుంటే నంబర్‌వన్‌ పోలీస్‌ ఎలా అవుతుంది. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఎంత మందిని అరెస్ట్‌ చేశారు. మనమంతా కూర్చున్న ఈ వేదిక అక్రమ కట్టడమే. ఈ విషయం నిన్న కూడా చెప్పా. ఈ నిర్మాణం అక్రమమని జలవనరుల శాఖ నివేదిక కూడా ఇచ్చింది. మన కళ్లెదుటే మాజీ సీఎం అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వమే అక్రమ కట్టడాలను నిర్మిస్తే ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు? ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండటానికి వీల్లేదని మరోసారి స్పష్టం చేశారు. మంచి పాలనపై మీరు తీసుకునే నిర్ణయాల పట్ల నా పూర్తి సహకారం ఉంటుంది. అప్పుడే సుపరిపాలన అందించగలం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్న నేర్పించారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీఆఫ్‌ అందించాలని నిర్ణయించాం. కుటుంబంతో గడపాల్సిన అవసరం పోలీసులకు ఉంది. దీనివల్ల మరింత ఉత్తేజంతో వారు విధుల్లోకి వస్తారు అని తెలిపారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.