Telugu Gateway
Politics

చంద్రబాబు వైసీపీలోకి వెళితే.. నేను బిజెపిలోకి వెళ్తా!

చంద్రబాబు వైసీపీలోకి వెళితే.. నేను బిజెపిలోకి వెళ్తా!
X

తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కలకలం రేపుతోంది. లోక్ సభలో విప్ వంటి పెద్ద పదవి తనకు వద్దంటూ ఫేస్ బుక్ లో వ్యంగంగా పోస్టు పెట్టిన నానితో ఆ పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ సమావేశం అయ్యారు. తనను ఎవరూ పంపలేదని..తాను వ్యక్తిగతంగానే పోస్టు చూసి నానిని కలిసేందుకు వచ్చానని గల్లా జయదేవ్ ప్రకటించారు. అదే సమయంలో నానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఫోన్ చేశారు. తనను కలవాల్సిందిగా ఆయన ఫోన్ లో కోరారు. నాని..గల్లా జయదేవ్ ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు సమాచారం. గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా మూడు పదవులు తీసుకుందామని చంద్రబాబు ముందే చర్చ జరిగిందని నాని గల్లా జయదేవ్ కు గుర్తుచేశారు.

కానీ తనకు పదవులపై వ్యామోహం లేదని ఆ రోజే చెప్పానని వివరించారు. అయినా తనకు పార్లమెంట్‌లో విప్ పదవి కంటే ఎంపీ పదవే చాలా గొప్పదన్నారు. దాని కోసం సొంతమైనవన్నీ వదులుకుంటా తప్ప పదవికి మచ్చ మాత్రం తీసుకురానని పేర్కొన్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు తనపై అసత్య వార్తలు రాస్తున్నారని తప్పుపట్టారు. అలాంటి వార్తలు రాసేవాళ్లకు తాను చెప్పేదొకటేనన్నారు. చంద్రబాబు వైసీపీలోకి వెళ్తే.. తాను బీజేపీలోకి వెళ్తానని గట్టిగా బుద్ధి చెప్పానన్నారు.

Next Story
Share it