Telugu Gateway
Politics

ఆ 400 కోట్ల సచివాలయానికి అయినా కెసీఆర్ వస్తారా?

ఆ 400 కోట్ల సచివాలయానికి అయినా కెసీఆర్ వస్తారా?
X

తెలంగాణ సర్కారు కొత్తగా నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సచివాలయానికి అయినా సీఎం కెసీఆర్ వస్తారా?. ఇదీ ప్రభుత్వ ఉన్నతాధికారులు..ఉద్యోగుల్లో నెలకొన్న సందేహం. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను పడగొట్టి..కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు చకచకా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇంకో ఏభై నుంచి అరవై సంవత్సరాల జీవిత కాలం ఉన్న సచివాలయ భవనాలను పడగొట్టాలన్న సర్కారు నిర్ణయంపై కొంత మంది ఐఏఎస్ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నరో అర్ధం కావటంలేదని ఓ కీలక శాఖకు చెందిన అధికారి వ్యాఖ్యానించారు. నిజంగా ఏమైనా లోపాలు..వాస్తు దోషాలు ఉంటే సరిదిద్దుకోవాలి కానీ..ఏకంగా భవనాలను పడగొట్టి..వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కార్యక్షేత్రం అంతా ‘ప్రగతి భవనే’. కేబినెట్ సమావేశం అయినా..సమీక్షా సమావేశం అయినా అక్కడే. పాలన అంతా అక్కడ నుంచే సాగుతోంది. కెసీఆర్ సచివాలయానికి రావటం లేదని విపక్షాలు విమర్శలు చేస్తే సీఎం ఎక్కడ ఉంటే అదే ఆఫీస్. సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని తేల్చేశారు.

గత ఐదేళ్ళ నుంచి ఇదే వరస. గత డిసెంబర్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే ప్రజలు తీర్పిచ్చాక కూడా ఇంకా కెసీఆర్ సెక్రటేరియట్ కు రావాలని అంటారా? అన్న స్థాయిలో ఉన్నాయి టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు. సీఎంగా కెసీఆర్ బాధ్యతలు చేపట్టాక పూర్తైన ఐదేళ్లలో కెసీఆర్ మహావస్తే సచివాలయానికి ఓ పది..పదిహేనుసార్లు వచ్చి ఉంటారు. అంతే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనకాడలేదు. ప్రస్తుత సీఎం కెసీఆర్ ప్రత్యేకంగా నిర్మించుకున్న ప్రగతి భవన్ పక్కనే వైఎస్ హయాంలో నిర్మించిన క్యాంప్ ఆఫీస్ ఉన్నా..దాన్ని కూడా కెసీఆర్ పక్కన పెట్టేశారు. మళ్ళీ తాను కోరుకున్నట్లు కోట్లాది రూపాయల వ్యయంతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారు.

సీఎం ఎక్కడ ఉంటే అదే సీఎం ఆఫీస్ అయినప్పుడు ... మరి ఇఫ్పుడు కొత్తగా 400 కోట్ల రూపాయల వ్యయం చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఏముంది. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమకు ఐఆర్ ప్రకటించటానికి ఆర్ధిక కష్టాలు ఉన్నాయని చెబుతున్న సీఎం..కొత్తగా భవనాలపై నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. పలు ఆస్పత్రుల్లో మౌలికసదుపాయాలు లేకపోయినా..పలు గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్థంగా ఉన్నా పట్టించుకోని సర్కారు మాత్రం నూతన భవనాల నిర్మాణంపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఓ వైపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకే నిధుల కటకట ఉన్న తరుణంలో ఈ భవనాల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏముందని కొంత మంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేసినా నూతన సచివాలయం పూర్తవటానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సచివాలయంలో ఉన్న శాఖలు పుట్టకొకటి..చెట్టుకొకటి మారటం వల్ల కూడా పరిపాలన మరింత కుంటుపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Next Story
Share it