Telugu Gateway
Politics

తడబాట్లు లేని తెలంగాణ..కెసీఆర్

తడబాట్లు లేని తెలంగాణ..కెసీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. అందులో రైతు బంధు ప్రధానమైనదని అన్నారు. రాష్ట్రంలో రైతులకు కొత్తగా మరో లక్ష రూపాయల రుణ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కెసీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రం నేటితో ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నది. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేళ్ళు చాలా చిన్న కాలం. అయితే మనం సాధించిన ఫలితాల రీత్యా ఈ ఐదేళ్ళు ఎంతో విలువైన కాలం. అనేక అప నమ్మకాలు, అనుమానాల నడుమ ఏర్పడ్డ రాష్ట్రం, అనతి కాలంలోనే వాటన్నింటినీ పటాపంచలు చేసింది. ఎక్కడా తొట్రుపాటు, తడబాటు లేకుండా పాలనలో పరిణతిని ప్రదర్శించింది, ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా శాంతిని సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రగతి పథంలో దూసుకు పోతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో అవలంభించిన సమర్థవంతమైన ఆర్థిక విధానాల వల్ల, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా చేయడం వల్ల, ఆర్ధిక క్రమశిక్షణను పాటించడం వల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా, పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకున్నది.

మన రాష్ట్రం గడిచిన ఐదేళ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వృద్దిరేటును సాధించింది. అర్థ శతాబ్దంగా తెలంగాణా ఎదుర్కుంటున్న అనేక జటిల సమస్యలకు ఈ ఐదేళ్ళలో శాశ్వత పరిష్కరాలను చూపగలిగాం. ఒకటొకటిగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మునుముందు మనముందు నిలిలిచిన పెను సమస్య కరెంటు సంక్షోభం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నమ్మిన వాళ్ళం. అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్నే సాధించుకున్న వాళ్ళం చిత్తశుద్ధితో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కదిలినం. తెలంగాణలో ఒకనాడు నాడు కరెంటు ఉంటే వార్త, నేడు పోతే వార్త. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. యావత్ దేశంలో వ్యవసాయంతో సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకేఒక రాష్ట్రం తెలంగాణ అని సంతోషంగా ప్రకటిస్తున్నాను. విద్యుత్ సరఫరాలో వచ్చిన గుణాత్మకమైన మార్పు ఇటు వ్యవసాయ రంగానికి అటు పారిశ్రామిక రంగానికి నూతనోత్తేజాన్ని కలిగించింది.

కరెంటు తర్వాత మనం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నం. మంచినీటి సమస్య సమగ్ర పరిష్కారం కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సఫలం అవుతుండడం ప్రజల కళ్ల ముందే దృశ్యమానంగా ఉంది. ఇంత భయంకరమైన వేసవి ఎండల్లోనూ ప్రజలు తాగునీటి కోసం గోసపడడం లేదు. నీళ్ళ కోసం మైళ్ళ దూరం నడిచి వెళ్లే బాధలు పడలేదు. గతంలో సర్వత్రా కనిపించే బిందెల ప్రదర్శనలు బంద్ అయ్యాయి. మిషన్ భగీరథ ప్రజలను ఆ బాధల నుండి విముక్తి చేసింది. మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చినయి. ఏనుగెళ్లింది తోక చిక్కింది అన్నట్లు కొంచెం పని మాత్రమే మిగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు 97 శాతం పూర్తయినయి. జూలై చివరి నాటికి వందకు వంద శాతం పూర్తవుతయి. పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయబోతున్నాం. తెలంగాణ ఏర్పడిన వెంటనే 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచి అందించిన పెన్షన్ ను ఇప్పుడు 2,016కు పెంచుతున్నాం. వికలాంగుల పెన్షన్ ను 1500 రూపాయల నుంచి 3,016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్దాప్య పెన్షన్ వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, కొత్తగా మరో ఆరేడు లక్షల మందికి పెన్షన్ అందించబోతున్నాం. పెంచిన పెన్షన్లను జూలై 1 నుంచి లబ్దిదారులకు అందిస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పేదల ప్రజలకు లభిస్తున్న భరోసా, భద్రత ప్రభుత్వానికి అత్యంత సంతృప్తి కలిగిస్తున్నది.

Next Story
Share it