అమరావతిలో జగన్...కెసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు అమరావతిలో ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. విజయవాడ చేరుకున్న కెసీఆర్ తొలుత కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన తర్వాత తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ సీఎం కెసీఆర్, ఆయన తనయుడు కెటీఆర్, ఇతర నేతలకు జగన్ స్వాగతం పలికారు. ఈ నెల21న ప్రారంభోత్సవం చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జగన్ ను ఆహ్వానించటంతోపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కెసీఆర్ కోరిక మేరకు జగన్ కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించటానికి అంగీకరించిన విషయం తెలిసిందే. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్స్ లో ఉన్న సంస్థల విభజన ఇంకా పెండింగ్ లో ఉంది. దీనికి తోడు విద్యుత్ బిల్లుల చెల్లింపు వివాదం కూడా పరిష్కారం కావాల్సి ఉంది.