Telugu Gateway
Andhra Pradesh

కెసీఆర్..జగన్ భేటీ..నిర్ణయం ఇదే

కెసీఆర్..జగన్ భేటీ..నిర్ణయం ఇదే
X

గోదావరి జలాలను మరింత సద్వినియోగం చేసుకోవటం ఎలా అనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు..మంత్రులు..ఉన్నతాధికారులు శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం తెలంగాణ, ఏపీ మంత్రులు ఆ వివరాలను మీడియాకు తెలిపారు. గోదావరి, కృష్ణా నదీజలాలను ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులను ఆదేశించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. నదీజలాల వినియోగంపై జూలై 15లోగా ప్రాథమిక నివేదిక అందుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపై చర్చించడానికి ముఖ్యమంత్రులు ప్రగతి భవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. నది జలాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ‘రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీజలాల వినియోగపై ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాలు దేశానికే మార్గదర్శకంగా ఉండాలని సీఎంలు ఆకాంక్షించారు.

ప్రగతి, అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి. షెడ్యూల్‌ 9, 10లోని అంశాలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సాగాయి. కరకట్ట పక్కన నిర్మాణాలు నిబంధనలకి విరుద్ధం.. చంద్రబాబు అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నార’ని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘వ్యవసాయం గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. రెండు రాష్ట్రాల్లో సాగునీటి, తాగునీటి ఇబ్బందులు పరిష్కరించేందుకు వేగవంతగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో గొప్పగా ఎదగడానికి ఇది ఒక ముందడుగు. ఘర్షణలకు తావులేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నార’ని తెలిపారు.

Next Story
Share it