Telugu Gateway
Cinema

‘కల్కి’ మూవీ రివ్యూ

‘కల్కి’ మూవీ రివ్యూ
X

హీరో రాజశేఖర్ కు పోలీస్ పాత్రలు అంటే కొట్టిన పిండే. ఆయన పోషించిన పోలీసు పాత్రలకు సంబంధించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి పోలీసు ఉన్నతాధికారిగా రాజశేఖర్ నటించిన చిత్రమే ‘కల్కి’. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయిందా?. రాజశేఖర్ చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ సినిమాతో ట్రాక్ లోకి వచ్చారు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ నటించిన సినిమా ఇదే. ఇందులో రాజశేఖర్ జోడీగా అదా శర్మ నటించారు. కల్కి సినిమా అంతా ఒక హత్య చుట్టూనే తిరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొల్లాపూర్ లో రాజ కుటుంబాలు..రాజకీయాలు..ఓ హత్య అన్నీ కలిపితే ‘కల్కి’ సినిమా. కొల్లాపూర్ లో తన రాజకీయ ఎదుగుదలకు అడ్డు వస్తారని ఓ రాజకుటుంబం మొత్తాన్ని హత్య చేయించుతాడు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే అంటే ఆ ప్రాంతంలో అందరికీ హడల్. ఎమ్మెల్యేకి ఎంత కర్కోటకుడు అని పేరుంటుందో..ఆయన తమ్ముడికి అంత మంచి పేరుంటుంది. కానీ సడన్ గా ఎమ్మెల్యే తమ్ముడు హత్యకు గురవుతాడు.

అయితే ఈ హత్యను ఎవరు చేశారు అన్నది చేధించటానికే కల్కి..ఐపీఎస్ గా రాజశేఖర్ అక్కడకు అడుగుపెడతాడు. ఈ క్రైమ్ సస్పెన్స్ సినిమా ఫస్టాఫ్ భారంగా కదులుతుంది. కానీ సెకండాఫ్ లోనే సినిమా కథలో కాస్త వేగం పుంజుకుంటుంది. ఎమ్మెల్యే సోదరుడి హత్య మిస్టరీని చేధించే క్రమంలో కల్కి చేసే విచారణ..ఆయనకు ఎదురయ్యే సవాళ్ళు..చివర్లో సస్పెన్స్ కు తెరదించుతూ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. వయస్సు ప్రభావమో ఏమో కానీ..రాజశేఖర్ లో జోష్ కన్పించలేదు. పోలీసు పాత్రలు ఆయనకు కొట్టిన పిండే కావటంతో నటన పరంగా రాజశేఖర్ తన సత్తా చాటారు. అదా శర్మ పాత్ర, వీళ్లిద్దరి లవ్ విషయంలో అసలు చెప్పుకోవాల్సింది ఏమీలేదు.

కల్కిని నిత్యం ఫాలో అయ్యే జర్నలిస్ట్ గా రామకృష్ణ సినిమాలో కాస్త సందడి చేస్తాడు. కల్కి సినిమా ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్‌ నేపథ‍్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సీన్‌ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. శివేంద్ర సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. సినిమా కథకు తగ్గట్టు 1980ల నాటి లుక్‌ తీసుకురావటంలో ఆర్ట్‌ డిపార్ట్‌ మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. సీ కల్యాణ్‌తో కలిసి స్వయంగా సినిమాను నిర్మించిన రాజశేఖర్‌ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు.

రేటింగ్. 2.5/5

Next Story
Share it