Telugu Gateway
Andhra Pradesh

జగన్ ‘జలదీక్ష’ వ్యాఖ్యలు ఏ జలాల్లో కలిశాయో!

జగన్ ‘జలదీక్ష’ వ్యాఖ్యలు ఏ జలాల్లో కలిశాయో!
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం పర్యటన రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆయనకు ఇబ్బంది కలిగించబోతుందా?. అంటే ఔననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఎగువన ఉన్నామనే కారణంతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని..ఇవి పూర్తయితే ఏపీలో సాగు, తాగునీరు కష్టాలు తప్పవని జగన్ ప్రతిపక్షంలో ఉండగా ‘జలదీక్ష’ చేసిన సమయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతే కాదు..కెసీఆర్ ను హిట్లర్ అంటూ విమర్శించారు. సాక్ష్యాత్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి చెందిన పత్రిక సాక్షి కూడా అప్పట్లో వ్యతిరేక వార్తలు రాసింది. ఈ ప్రాజెక్టు గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వంటిదే అని పేర్కొంది. మరి ఇఫ్పుడు జగన్ ఎందుకు తన వైఖరి మార్చుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా ఒప్పందాలు జరిగాయా? అంటే అదీలేదు. జగన్ మాత్రం గతంలో చేసిన విమర్శలు అన్నీ మర్చిపోయి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవటాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కెసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని బహిరంగంగా ప్రకటించి జగన్ ఇప్పుడు ఏమీ మాట్లాడకపోవటం వెనక కారణాలు ఏంటి?.

జగన్ అప్పుడు చెప్పింది అసత్యలా లేక నిజాలా?. మరి నిజం అయితే ఏపీకి అన్యాయం జరుగుతున్నప్పుడు జగన్ ఏమీ మాట్లాడకుండా కెసీఆర్ నుంచి ఎలాంటి హామీ పొందకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. కెసీఆర్ మాత్రం చాలా దూకుడుగా గోదావరి..కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో ప్రతి అడుగుకి నీరు అందుతుందని ప్రకటించారు. కానీ జగన్ మాత్రం వీటిపై ప్రస్తుతానికి మౌనమే దాల్చుతున్నారు. తాజా పరిణామాలపై ప్రతిపక్ష టీడీపీ కూడా స్పందించింది. కాళేశ్వరంపై జగన్ యూ టర్న్ తీసుకున్నారని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెబుతోంది. గతంలో పలు అంశాల్లో మాట మార్చిన చంద్రబాబును వైసీపీ నేతలు పదే పదే యూటర్న్ బాబు అంటూ విమర్శించారు. మరి ఇఫ్పుడు జగన్ వంతు అవుతుందా?. కొంత కాలం వేచిచూడాల్సిందే.

Next Story
Share it