Telugu Gateway
Andhra Pradesh

ఓటమి కంటే..జగన్ దూకుడుతో టీడీపీలో కలకలం!

ఓటమి కంటే..జగన్ దూకుడుతో టీడీపీలో కలకలం!
X

ఓటమి ఓ షాక్. అంతే కాదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష టీడీపీని మరింత షాక్ కు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాలు ఖచ్చితంగా టీడీపీలో కలకలం రేపుతున్నాయనే చెప్పొచ్చు. ఆ స్పీడ్ ఏంటి?. ఆ నిర్ణయాలు ఏంటి?. ఆ దూకుడు నిర్ణయాలతో జగన్ రేంజ్ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. అసలు జగన్ కు పరిపాలన చేతనవుతుందా?. అనుభవం ఉందా? అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తో సహా అందరూ ఎన్ని విమర్శలు చేశారో. అన్ని విమర్శలను పటాపంచలు చేస్తూ జగన్ సీఎం అయిన దగ్గర నుంచి తీసుకుంటున్న వరస నిర్ణయాలు ప్రతిపక్ష టీడీపీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి. అసలు ఆ స్పీడ్ వెనక ఎవరు?. జగన్ నిర్ణయాలు వెనక ఎవరు?. ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. మంత్రివర్గ ఏర్పాటులో జగన్ చేసిన సామాజిక ‘కూర్పు’ రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలను కూడా షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. కేవలం ఆయా సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇస్తే..ఆయా కులాల వారు గంపగుత్తగా ఓట్లేస్తారా? అంటే ఖచ్చితంగా అలా చెప్పటం సాధ్యం కాదు. కానీ జగన్ నిర్ణయాలు కల్పించే ‘పాజిటివ్ ఇంప్యాక్ట్’ మాత్రం చాలా కీలకం అని చెప్పకతప్పదు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలా ఎన్నికలకు ఏడాది..ఆరు నెలల ముందో మైనారిటీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇస్తే ఆ ప్రభావం ఏమీ ఉండదు. కానీ ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లోనే తనకు అండగా నిలిచిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా జగన్ స్పష్టమైన సంకేతం పంపారు. పవన్ కళ్యాణ్ కారణంగా కాపులు చాలా వరకూ తమవైపు లేరు అని తెలిసినా కూడా జగన్ తన మంత్రివర్గంలో కాపులకు రెడ్లతో సమానంగా ప్రాతినిధ్యం కల్పించటంతో పాటు కీలక శాఖలు అప్పగించటంతో ‘రాజకీయ వ్యూహాం’ సూపర్ అని ప్రత్యర్ధులు కూడా అంతర్గతంగా ప్రశంసించాల్సిన పరిస్థితి. అసలు ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఐదేళ్ళ కాలంలో ఆయా కులాలకు జగన్ సర్కారు చేసే సంక్షేమ కార్యక్రమాల ప్రభావం రాబోయే రోజుల్లో కానీ తేలనున్నాయి.

జగన్ ఎన్నికల హామీల అమలుతో పాటు..ఇతర నిర్ణయాలు తీసుకోవటంలో చాలా దూకుడుగా ఉన్నారు. ఎన్నికల హామీ ప్రకారం దశల వారీగా పెన్షన్ పెంపు ప్రకటన ఇఫ్పటికే చేసేశారు. అంతే కాదు సోమవారం నాటి మంత్రివర్గంలో ఆర్టీసీ విలీనం, సీపీఎస్ రద్దు, రైతు భరోసా కింద 12500 కోట్ల రూపాయల మంజూరుతోపాటు మరికొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. అధికారంలోకి వచ్చాక తీరిగ్గా కమిటీలు వేసి కాలక్షేపం చేయకుండా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లటంతో ఆ ప్రభావం ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిర్ణయాల్లో వేగం వల్ల ఎప్పుడైనా పొరపాట్లు జరిగినా దిద్దుబాటుకు కూడా కావాల్సినంత సమయం దొరుకుతుందని..అంతే కానీ చంద్రబాబులా ‘సాగదీత’తో సమస్యలు తప్ప..ప్రయోజనం ఉండదని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత జగన్ దూకుడు...నిర్ణయాలు తీసుకుంటున్న తీరు చూస్తుంటే కనీసం ‘పదేళ్ళ పాటు’ అన్నీ మర్చిపోవాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఊహింఛని రీతిలో 151 ఎమ్మెల్యేలతో అప్రతిహత అధికారాన్ని దక్కించుకుని తిరుగులేని స్థితిలో ఉన్నా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పేరుతో మంత్రివర్గాన్ని రెండున్నర సంవత్సరాలకు మారుస్తానని ప్రకటించటం ద్వారా జగన్ ఊహించినంత బలమైన నేత కాదు అనే సంకేతాలు పంపారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈ పరిస్థితి సంకీర్ణాల్లోనూ....తక్కువ మెజారిటీలు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ అనూహ్యంగా జగన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది కూడా ఆశ్చర్యంగానే ఉంది. చంద్రబాబులా కాకుండా ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన జగన్ తన ఎమ్మెల్యేలకు అధికారాన్ని సగం సగం ‘పంచుతా’ అనటం ఓ ప్రతికూల సంకేతంగా నిలుస్తుంది. అదే సమయంలో సామాజిక సమతుల్యత విషయంలో రాజకీయంగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు నియామకం కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. మొత్తానికి జగన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ‘పాజిటివ్ టాక్’ను తెచ్చుకున్నారు. ప్రతి చోటా జగన్ రాజకీయ నిర్ణయాలు..హామీల అమలే హాట్ టాపిక్ గా మారాయనే నివేదికలు సర్కారుకు అందుతున్నాయి.

Next Story
Share it