జగన్...దూకుడొద్దు!
ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘దూకుడు’ వద్దని కేంద్రం సూచించింది. ముఖ్యంగా విద్యుత్ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) సమీక్షించనున్నట్లు పత్రికల్లో..ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేంద్ర నూతన, పునరుద్పాతన విద్యుత్ శాఖ కార్యదర్శి అనంద్ కుమార్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి లేఖ రాశారు. ఏపీలో సోలార్, పవన్ విద్యుత్ సంస్థల ఒప్పందాలను సమీక్షించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వచ్చినట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పలు రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీలు విద్యుత్ చట్టంలోని 62, 63 సెక్షన్ ప్రకారం ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొన్నారు. టారిఫ్ ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణా సంస్థలు సీఈఆర్ సీ మార్గదర్శకాల ప్రకారం నిర్ధారించాయని పేర్కొన్నారు. తర్వాత బహిరంగ..పోటీ బిడ్డింగ్ ల ద్వారా టారిఫ్ నిర్ధారించి..పీపీఏలు చేసుకున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం 2022 నాటికి దేశంలో 175 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కూడా కేంద్ర కార్యదర్శి తన లేఖలో ప్రస్తావించారు. ఎలాంటి కారణాలు లేకుండా పీపీఏలను సమీక్షిస్తే ఇది జాతీయ టార్గెట్ పై ప్రభావం చూపిస్తుందని తెలిపారు.
అదే సమయంలో పీపీఏలను సమీక్షిస్తే అది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని.. అంతే కాకుండా ఈ రంగం విశ్వాసం సన్నగిల్లుతుందని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో..దేశంలో పెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ప్రస్తావించారు. ఈ అంశాలు అన్నింటిని..వాస్తవాలను ముఖ్యమంత్రికి నివేదించాలని తన లేఖలో కోరారు. ఈ లేఖ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఏకంగా కేంద్ర పునరుద్పాదన విద్యుత్ శాఖ కార్యదర్శి లేఖ రాయటం ఏమిటనే చర్చ మొదలైంది. పైగా చంద్రబాబు హయాంలో జరిగిన కొన్ని అడ్డగోలుగా ఒప్పందాల వల్ల భారం పడేది రాష్ట్ర ఖజానాపై అని..గతంలోనే కొంత మంది అధికారులు ఒప్పందాలను ‘ఆన్ రికార్డు’ వ్యతిరేకించారని చెబుతున్నారు. అయితే ఈ లేఖ వెనక అనూహ్యంగా విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దక్కించుకుంటున్న ఓ ‘పచ్చ’ కంపెనీ హస్తం ఉందనే అనుమానాలు ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్రం కూడా రాష్ట్ర వ్యవహరాల్లో ఇంత త్వరగా జోక్యం చేసుకుంది అంటే ఇందులో ‘పెద్ద ఒత్తిళ్ళే’ పనిచేసి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.