నీతిఅయోగ్ లో జగన్ ‘ప్రత్యేక హోదా’ డిమాండ్
‘రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరం. ఏపీలో పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు లేవు. రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పులు 97 వేల కోట్లు. ఇప్పుడు అవి 2.58 లక్షల కోట్లకు చేరాయి. ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ, మరో ఇరవై వేల కోట్ల రూపాయలు అసలు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోండి. హోదా ఇవ్వండి’ అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నీతి అయోగ్ సమావేశంలో కోరారు. ఈ మేరకు ఆయన ఓ నివేదికను సమావేశంలో అందజేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయిన ఏపీలో రెవెన్యూ లోటు 66,362 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపారు. తెలంగాణలో మిగులు ఉంటే..ఏపీ మాత్రం లోటులో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్‌కు గల అర్హతలను ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీని సీఎం వైఎస్ జగన్ కోరారు. గతంలో బీజేపీ తన మేజిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తూ గత కేబినెట్ తీసుకున్న నిర్ణయం కాపీని అందజేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేయలేదని చెబుతూ.. ప్లానింగ్ కమిషన్ అబిజిత్ సేన్ లేఖను జతచేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాలకు కేంద్ర సాయం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణలను తెలియజేస్తూ కేంద్ర సాయాన్ని కోరారు.