Telugu Gateway
Politics

జగన్ నిర్ణయాలు కెసీఆర్ కి ఇరకాటం?!

జగన్ నిర్ణయాలు కెసీఆర్ కి ఇరకాటం?!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ను ఇరకాటంలోకి నెడతాయా?. రాబోయే రోజుల్లో ఆయనపై ఒత్తిడి పెంచుతాయా అంటే ఔననే చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా పక్షం రోజులు కాలేదు. కానీ ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన అత్యంత కీలక హామీలైన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి కీలక నిర్ణయాలపై వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ఏపీ పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా కూడా జగన్ ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే..ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో మాత్రం కెసీఆర్ మాత్రం ఏమీ పట్టించుకోవటం లేదు. కొద్ది రోజుల క్రితం సీఎం కెసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఓ హెచ్చరిక చేశారు. ఇలాగే చేస్తే ఆర్టీసీ మూసేస్తామంటూ ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులు కూడా ఎప్పటి నుంచో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తరహాలో కెసీఆర్ ఈ రెండు అంశాలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కూడా ఓ వైపు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీలోనే ఈ రెండు కీలక అంశాలను అమలు చేస్తుంటే..ధనిక రాష్ట్రం అయిన తెలంగాణలో మాత్రం ఎందుకు చేయరు అన్న ప్రశ్న ఉదయించటం ఖాయం. పైగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర సాధన విషయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర తక్కవేమీ కాదు. కానీ అత్యంత కీలకమైన ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఇప్పుడు తెలంగాణ సర్కారు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.

కానీ ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి అత్యంత కీలకమైన నిర్ణయాలను తొలి మంత్రివర్గ సమావేశంలోనే పెట్టి నిర్ణయం తీసుకోవటానికి రెడీ అయిపోతున్నారు. ఎన్నికల ముందు వరకూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడితో పోలిస్తే నిర్ణయాలు తీసుకోవటంతో తెలంగాణ సీఎం కెసీఆర్ చాలా వేగం అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత ఎవరు ముందు ఉంటారు అన్న చర్చ ఊపందుకుంటోంది. కెసీఆర్ తనకు కావాల్సిన హైదరాబాద్ భవనాలను మాత్రం ఆగమేఘాల మీద ఏపీ సీఎం జగన్ తో ఓకే చేయించుకున్నారు కానీ...ఏపీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులను తెలంగాణకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయటంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ సీఎంల నిర్ణయాల వేగంగా ఖచ్చితంగా ప్రజలు ‘లెక్క’లోకి తీసుకుంటారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it