బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా జె పీ నడ్డా

బిజెపిలో కీలక పరిణామం. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన హోం శాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆయన బాధ్యతలు నుంచి తప్పుకుంటారని భావించారు. కానీ త్వరలోనే జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కూడా అధ్యక్షుడిగా అమిత్ షానే ఉంటారని తేల్చారు. అయితే ప్రస్తుతం ఆయనపై పని ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకున్న నేపథ్యంలో ఆయనకు ఈ పదవిని అప్పగించారు. అలాగే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా నడ్డా బాధ్యతలు చేపట్టి.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ జాతీయ నాయకత్వం కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. జాతీయ అధ్యక్షుడిగా మాత్రం ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షానే కొనసాగనున్నారు.