Telugu Gateway
Politics

మోడీతో కెసీఆర్ కు దూరం పెరిగిందా?!

మోడీతో కెసీఆర్ కు దూరం పెరిగిందా?!
X

ఇదే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ సార‌ధ్యంలో శ‌నివారం నాడు ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న నీతి అయోగ్ స‌మావేశానికి కూడా తెలంగాణ సీఎం కెసీఆర్ దూరంగా ఉండ‌టం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఈ స‌మావేశానికి ఆహ్వానం అందింది. ఇప్ప‌టి వ‌ర‌కు నీతి అయోగ్ సిఫార‌సులు ఏ మేర‌కు అమ‌లు అయ్యాయి..రాబోయే రోజుల్లో చేయాల్సిన అంశాల‌పై దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల‌తో చ‌ర్చించేందుకు ఈ నీతి అయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం ఏర్పాటు చేశారు. గ‌తంలో కెసీఆర్ నీతి అయోగ్ కు ఓ సుదీర్ఘ నివేదిక‌ను కూడా అందజేశారు. ఇందులో ఆయ‌న ప‌లు అంశాలను ప్ర‌స్తావించారు. కానీ ఇప్పుడు కెసీఆర్ అత్యంత కీల‌క‌మైన నీతి అయోగ్ స‌మావేశానికి దూరంగా ఉండ‌టం ద్వారా సీఎం కెసీఆర్ స‌రైన సంకేతాలు పంప‌టంలేద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇది పూర్తిగా అధికారిక స‌మావేశం. నిజంగానే నీతిఅయోగ్ స‌మావేశాల వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం ఉండ‌టం లేదు..నీతి అయోగ్ సిఫారసులు ఏమీ అమ‌లు కావ‌టం లేదు అనుకుంటే ఇదే విష‌యాన్ని కూడా ఈ స‌మావేశంలో ప్ర‌స్తావించే ఛాన్స్ ఉంటుంది. కానీ కెసీఆర్ మాత్రం ఈ స‌మావేశానికి హాజ‌రు కాకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టం కీల‌కంగా మారింది.

కానీ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం నీతి అయోగ్ స‌మావేశంలో పాల్గొనేందుకు ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్నారు. జ‌గ‌న్, కెసీఆర్ లు ప్ర‌స్తుతం అత్యంత స‌న్నిహితంగా మెలుగుతున్నారు. కానీ ఇద్ద‌రూ చెరో నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో మెజారిటీ సీట్లు ద‌క్కించుకుని కేంద్రంలో చక్రం తిప్పాల‌ని చూసిన తెలంగాణ సీఎం కెసీఆర్ కు ఫ‌లితాలు నిరాశ క‌లిగించిన విష‌యం తెలిసిందే. అటు ఎన్డీయే, ఇటు యూపీఏకు పూర్తి మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని..కేంద్రంలో ప్రాంతీయ పార్టీలో చ‌క్రం తిప్పుతాయ‌ని గట్టిగా న‌మ్మిన కెసీఆర్ కు ఇప్పుడు ఇర‌కాట ప‌రిస్థితి ఎదురైంది. అంతే కాదు..ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తెలంగాణ‌లో బిజెపి ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు ద‌క్కించుకోవ‌టం అత్యంత ప్రాధాన్య‌తాంశంగా మారింది. తాజాగా జ‌రిగిన టీఆర్ఎస్ పార్లమెంట‌రీ పార్టీ స‌మావేశంలో కూడా కెసీఆర్ బిజెపి రాజ‌కీయ వ్యూహాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ ముందుకు సాగాల‌ని ఎంపీల‌కు సూచించారు. బిజెపి ఇప్పుడు తెలంగాణ‌లో దూకుడు పెంచేందుకు సిద్ధ‌మైన త‌రుణంలో కెసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నార‌ని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రాజ‌కీయం ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it