Telugu Gateway
Top Stories

ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన ట్రంప్

ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త రికార్డు నెలకొల్పారు. ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడుగా ఆయన చరిత్రలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లు మరోసారి భేటీ అయ్యారు. వీళ్లిద్దరూ కరచాలనం చేసుకుని దక్షిణ, ఉత్తర కొరియాల సరిహద్దులో ఉన్న నిస్పైనిక ప్రాంతంలో భేటీ అయి కొంత సమయం చర్చలు జరిపారు. ‘ఈ ప్రాంతానికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మరోసారి మీతో భేటీ కావటం ఎంతో సంతోషంగా ఉంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిమ్ కూడా ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మొదటి నుంచి తామిద్దరం ఒకరంటే ఒకరు గౌరవంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. తమ మధ్య మంచి స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. సరిహద్దుకు ఆవల ఉన్న భూ భాగంలోకి కిమ్ తో కలసి ట్రంప్ వెళ్ళారు. తర్వాత కిమ్ తో కలసి దక్షిణ కొరియా భూభాగంలోనూ అడుగుపెట్టారు.

ఎవరూ చేయని సాహసం ట్రంప్ చేశారని..గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో అడుగుపెట్టలేదని కిమ్ వ్యాఖ్యానించారు. కిమ్ ఈ సమయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ తో కరచాలనం చేశారు. అత్యంత కీలకమైన మూడు దేశాల అధినేతలు కలవటం కూడా ఇదే మొదటిసారి కావటం విశేషం. వియత్నాంలోని హనోయ్‌లో జరిగిన సదస్సులో ఇరువురు నేతల మధ్య చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయిన అనంతరం వీరు తిరిగి కలుసుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు కిమ్‌ను అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ట్రంప్‌ కోరారు. అమెరికా అధ్యక్షుడి ఆహ్వానంపై కిమ్‌ స్పందన ఇంకా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని కిమ్‌ మన్నిస్తే అమెరికాను ఓ ఉత్తర కొరియా నేత సందర్శించడం ఇదే తొలిసారి అవుతుంది.

Next Story
Share it