టీడీపీలో గంటా మీటింగ్ కలకలం!
గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే గంటా శ్రీనివాసరావు టీడీపీకి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళి బిజెపిలో చేరతారు అని. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లు పార్టీ మారినప్పటి నుంచి ఈ ప్రచారం జోరందుకుంది. అయితే ఇవి రూమర్లా..ఈ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఈ తరుణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో సమావేశం పెట్టుకోవటం కలకలం రేపుతోంది. అయితే గంటా అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు. కేవలం ఇది నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం మాత్రమే అని చెబుతున్నారు. ఏది ఏమైనా బిజెపి మాత్రం ఏపీతో పాటు తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగా ఏ మాత్రం విమర్శలకు వెరవకుండా కూడా ఆరోపణలు ఉన్న నేతలను కూడా అక్కున చేర్చుకుంటోంది.
బిజెపి టార్గెట్ రాజకీయంగా బలపడటం తప్ప...మరొకటి కాదన్న చందంగా వ్యవహరిస్తోంది. గంటా మంగళవారం మధ్యాహ్నం విశాఖ ఉత్తర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశమయ్యారు. తాను పార్టీ మారుతానంటూ మీడియాలోనే ప్రసారం చేసుకుంటున్నారని.. ఆ వార్తలకు రియాక్ట్ అవ్వాల్సిన అక్కర్లేదన్నారు. ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత ఇప్పుడు చాలా సార్లు పార్టీ మారుతానంటూ కథనాలు వచ్చాయని, ప్రచారం కూడా చేస్తున్నారని విమర్శించారు. ఈ పుకార్లు వచ్చిన టైమ్లో తాను శ్రీలంక పర్యటనలో ఉన్నానని.. స్నేహితులతో కలిసి దేవాలయంకు వెళ్లానన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఆ అవసరం తనకు లేదని చెబుతన్నట్లు సమాచారం.