మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాడి!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ వో)పై ఓ ఎమ్మెల్యే సోదరుడు కర్రతో దాడి చేయటం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు అటవీ సిబ్బందిపై గ్రామస్తులు దాడికి దిగటంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ ఘటన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో జరిగింది. సార్ సాలా గ్రామంలో అటవీ సిబ్బంది రైతులు ఒక్కసారిగా కర్రలతో విరుచుకుపడటంతో సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖ్యంగా ట్రాక్టర్ పై ఉన్న ఎఫ్ఆర్ వో చోలే అనితను ఓ వ్యక్తి కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అవటంతో పాటు వెంటనే కిందపడిపోయారు. హరితహారంలో భాగంగా సార్ సాలా గ్రామ్ వద్ద ఉన్న అటవీ భూమిని చదును చేసేందుకు అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
వీరిని స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్ఫీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తనపై దాడి చేసింది ఎమ్మెల్యే సోదరుడే అని ఎఫ్ఆర్ వో ఆరోపిస్తున్నారు. అటవీ భూములను స్వాధీనం చేసుకుంటామని..తమకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని చెప్పటంతో రైతులు అటవీ సిబ్బందిపైదాడికి పాల్పడ్దారు. అనితకు ప్రస్తుతం కాగజ్ నగర్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.