Telugu Gateway
Andhra Pradesh

ఛంద్రబాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..టీడీపీ ఎంపీలు జంప్

ఛంద్రబాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..టీడీపీ ఎంపీలు జంప్
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబునాయుడి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కేవలం బిజెపికి అనుబంధంగా కొనసాగటానికే పరిమితం అవుతారా? లేక ‘పాత అక్రమాల చిట్టా’ను మొత్తం బయటపెడతారా? అన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో ఉంది. అయితే తీవ్రమైన ఆర్ధిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిని చేర్చుకోవటం ద్వారా బిజెపి ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతుంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబును దెబ్బకొట్టడమే లక్ష్యంగా కేంద్రంలో బిజెపి, ఏపీలో వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కేవలం నామమాత్రపు పార్టీగా పరిమితం అయిన టీడీపీ..ఏపీలో కూడా ఇప్పుడు అదే స్థితికి చేరనుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏపీ బిజెపి మాత్రం చాలా దూకుడు చూపిస్తోంది. అయితే అది అంతా ఢిల్లీ నుంచి డైరక్షన్స్ నుంచి అన్న సంగతి తెలిసిందే. గురువారం నాడు రాజకీయంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది.

నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని తేలిపోతోంది. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారని చెబుతున్నారు. దీనిపై ఈ క్షణంలో అయినా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు.

Next Story
Share it