Telugu Gateway
Politics

జగన్ పై కాంగ్రెస్ ప్రశంసలు

జగన్ పై కాంగ్రెస్ ప్రశంసలు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఫిరాయింపులపై అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన ప్రకటన...టెండర్ల అక్రమాలకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ వేయాలని జగన్ తీసుకున్న నిర్ణయాలను మల్లు భట్టివిక్రమార్క స్వాగతించారు. ఈ మేరకు తన లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో జగన్ కు మరో కీలక సూచన చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించుకున్నారు. ఏపీ సీఎంతో పాటు మహారాష్ట్ర సీఎంను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇప్పటికే ముంబయ్ వెళ్ళి ఫడ్నవీస్ ను కెసీఆర్ ఆహ్వానించారు.

త్వరలోనే ఏపీ పర్యటనకు కూడా వెళ్ళనున్నారు కెసీఆర్. ఈ తరుణంలో భట్టి విక్రమార్క లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతితో నిండిపోయిందని..అంతే కాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన ప్రాజెక్టును కాదని..అంచనా వ్యయాన్ని పెంచి దోచుకుంటున్నందున ఇందులో భాగస్వామ్యం కావొద్దని జగన్ కు సూచిస్తున్నట్లు భట్టి విక్రమార్క తన లేఖలో పేర్కొన్నారు. వైఎస్ 38 వేల కోట్ల రూపాయలతో ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టును తలపెడితే కెసీఆర్ దీని పేరు మార్చి అంచనా వ్యయాన్ని లక్ష కోట్ల రూపాయలకు పైగా పెంచారని ఆరోపించారు. తెలంగాణలోనూ అదే తరహాలో టెండర్ల వివరాలు జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందు ఉంచాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు.

Next Story
Share it