Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీన నోటిఫికేషన్ జారీ

టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీన నోటిఫికేషన్ జారీ
X

సక్రమమా?. అక్రమమా అనే సంగతి పక్కన పెడితే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ )లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం పూర్తయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో గత కొంత కాలంగా సాగుతున్న ప్రచారమే నిజం అయింది. తమను టీఆర్ఎస్ విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేయటం..ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయటం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, జాజుల సురేందర్, రేగ కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆత్రం సక్కు, బి. హర్షవర్ధన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించారు. తామంతా కాంగ్రెస్ తరపున ఎన్నికైనా కూడా ప్రస్తుతం సభలో ఉన్న ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మంది టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో చేరాలని నిర్ణయించుకున్నందున తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరారు. వీరి లేఖకు మద్దతుగా టీఆర్ఎస్ కూడా ఓ లేఖ అందజేసింది. దీంతో విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లు అయింది.

అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వైపు సీట్లు కేటాయించాలని ఆదేశించారు. టీఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహచార్యులు తన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్‌ సబ్‌-పేరా(2)లోని నిబంధనలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు విలీనం చేసినట్టు వివరించారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రుల చేరికతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం 102కు చేరింది. ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. విలీనంపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యేలను కొనుగోలుపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Next Story
Share it