Telugu Gateway
Andhra Pradesh

అంతా మీరే చేశారు...బాబూ!

అంతా మీరే చేశారు...బాబూ!
X

ఓట‌మి త‌ర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాస్త‌వాలు గుర్తించ‌కుండా ఇంత కాలం షో చేస్తూ వచ్చింది. నిత్యం మ‌హిళ‌ల‌ను త‌ర‌లిస్తూ నువ్వెట్లా ఓడిపోయావ‌య్యా అంటూ సెంటిమెంట్ డైలాగ్ ల‌తో సినిమాను ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేశారు. అంటే ఇప్ప‌టికీ తెలుగుదేశం అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వాస్త‌వాల‌ను గుర్తించే ప‌రిస్థితిలో లేరు. ఎంతో చేసినా మ‌న‌కు ఎందుకీ ప‌రిస్థితి అంటూ నిట్టూర్పులు విడ‌టం త‌ప్ప‌..న‌మ్మి అధికారం ఇచ్చిన ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేశామ‌నే విష‌యాన్ని గుర్తించ‌టానికి సిద్ధంగా లేరు. క‌ళ్ళ ముందు ఎన్నో వైఫ‌ల్యాలు క‌న‌ప‌డుతున్నా..వాటిని గ్ర‌హించ‌కుండా త‌ప్పుల‌ను ఎవ‌రో ఒక‌రిపైకి నెట్టి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలే. ఇలాగే ముందుకు సాగితే భ‌విష్య‌త్ లోనూ తిప్పలు త‌ప్పవ‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. ఓట‌మి కార‌ణాలు వెతికేప‌నిలోనూ మళ్ళీ అవే త‌ప్పులు. ఎంత చిన్న రాజ‌కీయ నాయ‌కుడు అయినా ఓ సారి చేసిన త‌ప్పు మ‌ళ్ళీ చేయ‌కూడ‌దు. చేస్తే అది అత‌నికే న‌ష్టం. కానీ చంద్ర‌బాబు మాత్రం ప‌దేళ్ళు అధికారానికి దూరం ఉండి కూడా...మ‌ళ్ళీ అధికారంలోకి వ‌చ్చాక అవే త‌ప్పులు చేశారు. అటు చంద్ర‌బాబు, ఇటు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కానీ అస‌లు ఎవ‌రు ఏమి చెప్పినా విన‌టానికి సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌టం..నిజాలు చెప్పిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలుగుదేశం పార్టీని ఈ స్థితికి తెచ్చింద‌ని ఓ నేత వ్యాఖ్యానించారు.

నిజాలు చెప్పేవారిని దూరం పెట్టి...రాజ‌కీయాల‌తో సంబంధం లేని భ‌జ‌న‌ప‌రుల‌ను మాత్రం ప‌క్క‌న పెట్టుకుని వారు చెప్పిందే చేసి ఇప్పుడు ఫ‌లితం అనుభవిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన అతి కీల‌క‌మైన హామీ రైతు రుణ‌మాఫీ. అధికారంలో ఐదేళ్ళ‌లో చంద్ర‌బాబు చేసిన అప్పు దాదాపు 1.50 లక్షల కోట్ల రూపాయ‌లు. ఇంత అప్పు చేసి కూడా కీల‌క‌మైన హామీని నిల‌బెట్టుకున్నారా?. లేదు. నీరు-చెట్టుపై 6000 కోట్ల రూపాయ‌ల దార‌పోశారు. ఫైబ‌ర్ గ్రిడ్ కోసం నాలుగు వేల కోట్ల రూపాయ‌ల అప్పులు చేశారు. అస‌లు ప్రాధాన్య‌త ఏమిటి?. రైతుల‌కు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవ‌ట‌మా?. లేక దోపిడీ స్కీమ్ లు కొన‌సాగించ‌ట‌మా?. ఈ డ‌బ్బే రైతు రుణ‌మాఫీకి మ‌ళ్లించి రుణ‌మాఫీ హామీని నిల‌బెట్టుకుని ఉండే ధైర్యం చెప్పుకోవ‌టానికి అయినా ఉండేది. కానీ ఆ ప‌ని చేయ‌లేదు. చంద్ర‌బాబు పాల‌న‌లో మ‌రో అతి పెద్ద ఫెయిల్యూర్ రాజ‌ధాని అమ‌రావ‌తి. ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను ఆకాశం ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ళి ..సింగ‌పూర్ పేరుతో మోసాలు చేసి..క‌నీసం ఒక్క‌టంటే ఒక్క శాశ్వ‌త భ‌వ‌నం క‌ట్ట‌కుండా ఓ అతి పెద్ద ఫెయిల్యూర్ అన్పించుకున్నారు. వైఎస్ హ‌యాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి అధికారంలోకి వ‌చ్చాక అంత‌కు మించిన దోపిడీ చేశారు. నిత్యం ఏదో ఒక ర‌కంగా మీడియాలో ఉండ‌టానికి ప్రాధాన్యత ఇచ్చారు త‌ప్ప‌..అస‌లు ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు..వారి మ‌న‌సుల్లో ఏమి ఉందో వాస్త‌వాలు తెలుసుకోవ‌టంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. జ‌నం అంతా మీడియా ప్ర‌చారం చూసి త‌న‌ను త‌ప్ప ఇంకెవ‌రిని గెలిపిస్తారు అని ఎదురుప్ర‌శ్నించారు చంద్ర‌బాబు, నారా లోకేష్ లు.

నిజానికి చంద్ర‌బాబు చేసిన రివ్యూల స‌మ‌యాన్ని గ‌మ‌నంలోకి తీసుకుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్ప‌టికే అమెరికా రేంజ్ కు వెళ్లి ఉండాల‌ని వ్యంగాస్త్రాలు సంధించారు. మ‌రి వారం వారం పోల‌వ‌రం...వారం వారం అమ‌రావ‌తి రివ్యూలు అయితే జ‌రిగాయి. మ‌రి ప్ర‌జ‌ల‌ను వాటిని ఎందుకు న‌మ్మ‌లేదు.

లోపం ఎక్క‌డ ఉంది?. ప‌రిపాల‌న ప్ర‌జ‌ల కోసం చేయాలా?. లేక మీడియా లో వార్త‌ల కోసం చేయాలా? ఈ అంశాల‌ను చంద్ర‌బాబు ఎప్పుడో విస్మ‌రించారు. ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నారు. ఇప్పుడు టీడీపీ రివ్యూలో నేత‌లు అంద‌రూ అంతా మీరే చేశారు...బాబూ అంటూ బొమ్మ‌రిల్లు సినిమాను గుర్తు చేస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు నిర్వ‌హించిన వ‌ర్క్ షాప్ లో కొంత మంది నేత‌లు నోరు విప్పారు. వేల మందితో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లను ఆ పార్టీ నేత అశోక్ గజపతిరాజు తప్పు పట్టారు. వేల మందితో టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో హ్యూమన్ టచ్ పోయిందని మరో నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు బాగా దూరమయ్యారని జూపూడి అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ నివేదికలు కొంప ముంచాయని ఎమ్మెల్సీ శ్రీనివాసులు నివేదిన‌. కోడెల కుటుంబం అక్రమాలపై జనం ఎన్నికల సమయంలోనే ప్రస్తావించారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తెలిపారు. గ్రామ స్థాయిలో నేతల అవినీతిపై బాబుకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని, చంద్రబాబు చుట్టూ చేరిన బృందం వాస్తవాలు తెలియకుండా చేశారని దివ్యవాణీ వాపోయింది. విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుదామని అనంతపురం జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కలిసి ఉండకపోతే మరింత నష్టం జరుగుతుందని అనంత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.విచిత్రం ఏమిటంటే నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారు...ఫిరాయింపు నేత‌లు కొంత మంది టీడీపీ త‌ప్పుల‌ను ఎత్తిచూప‌టం. ఇదీ వెరైటీ.

Next Story
Share it