Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు భద్రతా తనిఖీ మినహాయింపుల్లేవ్..జాబితా ఇదే

చంద్రబాబుకు భద్రతా తనిఖీ మినహాయింపుల్లేవ్..జాబితా ఇదే
X

మాజీ ముఖ్యమంత్రి..సీనియర్ నేతగా, ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడికి ఓ హోదా ఉంది. కానీ సాక్ష్యాత్తూ ఏపీకి రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్ప ప్రకటన ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబును ఆయన ఓ ‘అసాధారణ, ఓ అరుదైన వ్యక్తిగా’గా భావిస్తున్నట్లు ఉంది ఆయన మాటలు చూస్తుంటే. సాదారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేయటం ఏంటి? ఇతర ప్రయాణికులతో కలసి చంద్రబాబును తీసుకెళ్ళటం ఏంటి? అంటూ చినరాజప్ప ఆక్రోశిస్తున్నారు. హోం మంత్రిగా పనిచేసిన ఆయనకు కనీసం విమానాశ్రయాల్లో ఎవరికీ భద్రతాపరమైన మినహాయింపులు ఉంటాయి..ఎవరికి ఉండవు అనే విషయం తెలియకపోవటం..తెలుసుకోకుండా విమర్శలు చేయటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవతోంది. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల మినహాయింపు ఎవరికి ఉంటుందో కేంద్ర పౌరవిమానయాన శాఖ స్పష్టమైన జాబితా విడుదల చేసింది.

దీని ప్రకారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉప రాష్ట్రపతులు, భారత దేశ చీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్, కేంద్ర కేబినెట్ ర్యాంక్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, డిప్యూటీ ఛైర్మన్ ప్లానింగ్ కమిషన్, లోక్ సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, విదేశాలకు చెందిన రాయబారులు, సుప్రీంకోర్టు జడ్జీలు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, డిప్యూటీ ఛైర్మన్ రాజ్యసభ, డిప్యూటీ ఛైర్మన్ లోక్ సభ, కేంద్ర మంత్రివర్గంలోని సహాయమంత్రులు, అటార్ని జనరల్ ఆఫ్ ఇండియా, కేబినెట్ కార్యదర్శి, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెవంట్ గవర్నర్లు, రాష్ట్ర హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు, ఎస్పీజీ భద్రత గలవారు, మాజీ ప్రధానులకు మాత్రమే భద్రత నుంచి మినహాయింపు కల్పిస్తారు. ఇది అధికారిక జాబితా. ఈ లెక్కన మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి ఏ రకంగా చూసినా భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు ఉండే అవకాశం లేదు. అలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తే ప్రజల్లో టీడీపీ నేతలు నవ్వుల పాలవటం తప్ప..పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు.

Next Story
Share it