చంద్రబాబు సర్కారు అక్రమాలపై సీబీఐ విచారణ!?
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందా?.అంటే ఔననే సమాధానం వస్తోంది ప్రభుత్వ వర్గాలనుంచి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అయింది. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏపీలో సీబీఐ తిరిగి ప్రవేశానికి అనుమతిస్తారనే వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా గురువారం నాడు ఏకంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంకా కొత్త కేబినెట్ ఏర్పాటు కూడా పూర్తికాక ముందే సర్కారు ఆగమేఘాల మీద ఈ ఉత్వర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉందా?. అంటే సహజంగా అయితే అంత అత్యవసం ఏమీ లేదనే చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆగమేఘాల మీద ఏపీలో సీబీఐ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయటం వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు ఎంత హాట్ హాట్ గా మారతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలు..అవినీతి జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులతో పాటు...రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లోనూ భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఇక అమరావతి అయితే అది ఓ పెద్ద మహాస్కామ్ గా చెప్పుకోవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీ ప్రభుత్వం సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్)ని పునరుద్ధరించింది. రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ గతేడాది నవంబర్‌లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జోవో ను రద్దు చేస్తూ.. సీబీఐ ప్రవేశానికి వీలుగా సాధారణ సమ్మతిని పునరుద్దరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా జీవోతో రాష్ట్రలోని కేసుల విచారణకు సీబీఐకి మార్గం సుగమం అయింది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ఎప్పుడైనా దర్యాప్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ గతేడాది నవంబర్ 8న టీడీపీ ప్రభుత్వం జోవో జారీ చేసిన సంగతి తెలిసిందే.