Telugu Gateway
Politics

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు గాయాలు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు గాయాలు
X

బిజెపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీస్ ల లాఠీ ఛార్జ్ లో గాయాలు అయ్యాయి. ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. బిజెపి ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించింది. ఓ ఎమ్మెల్యేపై పోలీసులు ఇలా దాడి చేస్తారా? అని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ నిరంకుశ, నియంతృత్వ, అరాచక పాలన పరాకాష్టకు చేరిందని స్పష్టమవుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్‌లోని స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు బుధవారం ఆర్థరాత్రి అక్కడి స్థానికులు ప్రయత్నించారు. అయితే విగ్రహానికి ప్రభుత్వ అనుమతి లేదని గోషామహాల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటన స్థలానికి వచ్చారు.

రాజాసింగ్ వచ్చిన అనంతరం అప్పటికే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిపై రాళ్లు రువ్వారు. అయితే వీరిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల లాఠీచార్జీలో రాజాసింగ్‌తోపాటు పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా అక్రమంగా లాఠీచార్జీ చేశారని పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక స్వాతంత్ర్య సమరయోధురాలి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడం అరాచకమని నిప్పులు చెరిగారు. ఈఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Next Story
Share it