Telugu Gateway
Politics

టీడీపీకి బిగ్ షాక్!

టీడీపీకి బిగ్ షాక్!
X

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి తేరుకోక ముందే తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ‘టార్గెట్ టీడీపీ’గా ఆ పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. ఏపీలోని అధికార వైసీపీ కూడా సాధ్యమైనంత మేర టీడీపీని దెబ్బకొట్టేందుకు అవసరమైన వ్యూహాలను అమలు చేయనుంది. వైసీపీ సంఖ్యాబలం పరంగా అత్యంత కంఫర్టబుల్ జోన్ లో ఉండటంతో ఫిరాయింపులకు తాము దూరం అని..ఎవరైనా వచ్చినా రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాల్సి ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బిజెపి రాష్ట్రంలోని నేతలతో పాటు..లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కూడా టార్గెట్ చేసి ఫిరాయింపులను ప్రోత్సహించే పనిలో పడింది. బిజెపి నేతలు మాత్రం తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఇదంతా కేవలం మైండ్ గేమ్ లో భాగమా? లేక నిజంగానే ఈ చేరికలు ఉంటాయా? అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు. ప్రస్తుతానికి మాత్రం టీడీపీలో ఈ వ్యవహారం పెద్ద కలకలమే రేపుతోంది.

ఢిల్లీ వేదికగా టీడీపీ రాజ్యసభ సభ్యులతో పాటు..లోక్ సభ సభ్యులను ఆకర్షించే పనిలో బిజెపి పడిందని చెబుతున్నారు. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి ఒక్క కనకమేడల రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని మూకుమ్మడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులపై ఫోకస్ పెట్టి సాధ్యమైనంత మందిని తమ వైపు తిప్పుకునే పనిలో బిజెపి ఉందని చెబుతున్నారు. చూడాలి ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో.

.

Next Story
Share it