ఏపీ కొత్త స్పీకర్ గా తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన స్పీకర్ గా సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పేరును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వివిధ పేర్లు ఈ పదవి కోసం పరిశీలనకు వచ్చినా జగన్ చివరకు తమ్మినేని వైపు మొగ్గుచూపారు. తమ్మినేని శుక్రవారం నాడు తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో జగన్ తన మనసులో మాటను బయటెపెట్టారు. స్పీకర్ పదవి చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన తమ్మినేని అందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శానససభ స్పీకర్‌గా అవకాశం దక్కడం పట్ల వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై అపారమైన నమ్మకం ఉంచి అప్పగించిన సభాపతి బాధ్యతలను త్రికరణశుధ్ధిగా నిర్వహిస్తానని తెలిపారు.
స్పీకర్‌గా ప్రతిపాదిస్తున్నట్టు సీఎం జగన్ తనతో చెప్పగానే సంతోషంగా ఫీలయ్యానని, ఏ పదవి ఇచ్చినా ఆదేశంగా భావిస్తానని అన్నట్టు తెలిపారు. స్పీకర్ పదవికి న్యాయం చేయగలననే నమ్మకం తనకుందన్నారు. సభా సంప్రదాయాలను, ప్రతిష్టను పెంచేవిధంగా నడుచుకుంటానని చెప్పారు. శాసనసభను సరైన పంథాలో నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో సభను హుందాగా నడిపిస్తానని అన్నారు. తన ఎంపికను ‘కళింగసీమకు ఇచ్చిన కంఠాభరణం’గా తమ్మినేని సీతారాం వర్ణించారు. స్పీకర్‌గా తనను ఎంపిక చేయడం పట్ల బీసీలంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.