అమెరికా వీసా...కొత్త రూల్స్
మీ ఫేస్ బుక్ ఖాతా చూసి మీ గురించి ఓ అంచనాకు వస్తారు. మీ ధోరణి సహజంగా ఉంటుందా?. ఏమైనా అసహజంగా ఉంటుంది. ఇలా ఓ మదింపు చేసుకోవటానికి అమెరికా ఇప్పుడు ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే వారు ఖచ్చితంగా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు చెప్పాలనే నిబంధన తెరపైకి తెచ్చింది. ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నా తాజాగా ఇది అమల్లోకి వచ్చింది. వివాదస్పదులకు తప్ప...ఇతరులు ఎవరికీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ఇది వ్యక్తిస్వేచ్చకు భంగం అనే వాదనా ఉంది. అయితే అమెరికా..అందులో ట్రంప్ ఇవి పట్టించుకుంటారా?. దేశ రక్షణ తర్వాతే ఏదైనా?. వీసా కావాలంటే ఆ వివరాలు ఇవ్వాల్సిందే అని తేల్చిచెబుతున్నారు. ఉగ్రవాదులతో ఇతర ప్రమాదకర వ్యక్తులను తమ దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం కోసం అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా తాజా నిర్ణయం ప్రభావం ఏటా ఒకటిన్నర కోటి మందిపై ఉంటుందని ఓ అంచనా. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలను క్షుణ్నంగా పరిశీలించి, ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా నిరోధించడంలో భాగంగానే ఇకపై సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను కూడా దరఖాస్తుదారులు వెల్లడించాల్సిందేననే నిబంధనను తెచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక పర్యటన కోసం వచ్చే వారు సహా ఎవ్వరైనా ఈ వివరాలు తెలియజేయాల్సిందేననీ, ఒకవేళ ఎవరికైనా సామాజిక మాధ్యమాల్లో ఖాతాలే లేకపోతే వాళ్లు ఆ విషయమే చెప్పవచ్చని తెలిపారు. ఎవరైనా అబద్ధం చెప్పినట్లు తేలితే వలస నిబంధనలకు అనుగుణంగా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అధికారి హెచ్చరించారు.