Telugu Gateway
Cinema

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ రివ్యూ

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ రివ్యూ
X

అందరూ కొత్తవారే. అయినా సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నించారు. డిటెక్టివ్ సినిమాలు తెలుగులో అరుదనే చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా ఏ మాత్రం గిప్పింగ్ గా లేకపోయినా ఫట్ అనటం ఖాయం. అందుకే ఎక్కువ మంది రిస్క్ తో కూడిన ఈ జానర్ కు వెళ్ళకుండా..కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేస్తూ సేఫ్ జోన్ లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ దర్శకుడు స్వరూప్ మాత్రం కొత్త నటులతో ఓ ప్రయోగం చేసి సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరో నటించిన నవీన్ పొలిశెట్టి మంచి మార్కులు దక్కించుకున్నాడనే చెప్పాలి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్..టీజర్ లే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల్లూరు కేంద్రంగా ఈ సినిమా స్టోరీ ముందుకు సాగుతుంది. ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బిఐ) పేరుతో ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ నడుపుతుంటాడు హీరో. ఆయనకు సహాయకురాలిగా చేరుతుంది శ్రుతి శర్మ.

చిన్న కేసులతో బండి లాగించే ఈ ఏజెన్సీకి ఓకేసారి పెద్ద కేసు దొరుకుతుంది. ఆ సమయంలో ఓ కేసులో ఇరుక్కుని శ్రీనివాస ఆత్రేయ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఆయన జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు. ఈ కేసును ఎలా చేధించాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. యూట్యూబ్‌ వీడియోస్‌తో పాపులర్‌ అయిన నవీన్‌ పొలిశెట్టి తొలిసారిగా హీరోగా నటించిన సినిమా సాయి శ్రీనివాస ఆత్రేయ. స్టేజ్‌ ఆర్టిస్ట్‌ గా మంచి అనుభవం ఉన్న నవీన్‌, ఆత్రేయ పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పాలి. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోవటంతో పాటు సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ లోనూ సత్తా చాటాడు. లుక్‌, యాటిట్యూడ్‌ ఇలా ప్రతీ విషయంలోనూ పర్ఫెక్షన్‌ చూపించాడు. స్నేహ పాత్రలో శృతి శర్మ ఆకట్టుకున్నారు. పెద్దగా నటనకు ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించారు.

ఇంట్రస్టింగ్ స్టోరీతో పాటు గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందించాడు. అయితే ఓ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో ఉండాల్సిన వేగం మాత్రం లోపించింది. చాలా సన్నివేశాలు సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌లో చాలా భాగం ఆత్రేయ పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు సమయం తీసుకున్నాడు దర్శకుడు. ద్వితీయార్థంలో వచ్చే ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ లోనూ స్లో నేరేషన్‌ ఇబ్బంది పెడుతుంది. మార్క్‌ కె రాబిన్‌ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. తన మ్యూజిక్‌తో మార్క్‌ సినిమా స్థాయిని పెంచాడు. ఎడిటింగ్‌ సినిమాకు మేజర్‌ డ్రా బ్యాక్‌. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఓ విజయవంతమైన ప్రయోగం కిందే చెప్పుకోవచ్చు.

రేటింగ్. 2.5/5

Next Story
Share it