జగన్ సమీక్షల షెడ్యూల్ రెడీ!

ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాఖల వారీ సమీక్షకు సిద్ధమయ్యారు. ఆయన జూన్ 1 నుంచి వరస పెట్టి పలు కీలక శాఖల సమీక్షలకు షెడ్యూల్ ఖరారు చేశారు. జూన్ 1న అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ, రెవెన్యూ శాఖలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో రికార్డు స్థాయిలో అప్పులు చేయటంతో పరిస్థితి దారుణంగా మారిందని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఆర్ధిక శాఖ తర్వాత వరుసగా విద్యా శాఖ, సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖపై, జూన్ ఆరున మాత్రం అత్యంత కీలకమైన సీఆర్ డీఏపై జగన్ సమీక్ష చేయనున్నారు.
శాఖల సమీక్ష అనంతరం మంత్రివర్గ విస్తరణ 8వ తేదీన ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తొలుత ఇది ఏడవ తేదీన ఉండొచ్చనే వార్తలు వెలువడ్డాయి. మంత్రివర్గ విస్తరణ..తొలి రోజే మంత్రివర్గ సమావేశం ఉండే అవకాశం ఉంది. అదే రోజు జగన్ సచివాలయానికి హాజరవుతారని చెబుతున్నారు. వాస్తు ప్రకారం ప్రస్తుతం సచివాలయంలో మార్పులు చేస్తున్నారు. ఇది సిద్ధమవటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ మాత్రం ప్రస్తుత సచివాలయం ఉన్న దగ్గరే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.