పెన్షన్ పెంపుపై జగన్ తొలి సంతకం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకం పెన్షన్ల పెంపుపై చేశారు. నవరత్నాల్లో హామీ ఇచ్చినట్లుగానే దశల వారీగా పెన్షన్ పెంపునకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ జూన్ నుంచి పెన్షన్ ను 2250 రూపాయలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుతూ మూడు వేల రూపాయలు చేస్తామని తెలిపారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. అవ్వా, తాత, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు కోరుతున్నట్లు తెలిపారు. పదేళ్ల నా రాజకీయ జీవితంలో.. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను. బాధలు విన్నాను. మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నాను. మీ అందరికీ నేను ఉన్నాను.
అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తాం. గత ప్రభుత్వం మాదిరి ప్రతీ కులానికి ఓ పేజీ పెట్టి ప్రతీ కులాన్ని ఎలా మోసం చేసేందుకు తావు లేకుండా రెండే రెండు పేజీల మేనిఫెస్టో తెచ్చాను. మన సీఎం మన కోసం ఏం చేస్తాడన్న సంగతి ప్రలజందరికి తెలిసి ఉండాలి. దానికి అనుగుణంగా మేనిఫెస్టో తెచ్చి మీ కళ్ల ముందు పెట్టాను. మీ ఆకాంక్షల మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భవద్గీతగా.. నా ఊపిరిగా భావిస్తానని సీఎం హోదాలో మాటా ఇస్తున్నాను.
నాలుగు లక్షల ఉద్యోగాలు
‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు.