అందరికీ రెండు ఛాన్స్ లు..చంద్రబాబుకే ఎందుకు ‘నో?’
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తొలి దఫా పాలనలో తొలి నాలుగున్నర సంవత్సరాలు ఏదో కొన్నిసార్లు తప్ప...అసలు సచివాలయానికే రాలేదు. పరిపాలన అంతా ‘లోపలి’ నుంచే సాగింది. సచివాలయానికి రాని కెసీఆర్ అని విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కెసీఆర్ డోంట్ కేర్ అన్నారు. ‘ముందస్తు’కు వెళ్ళి అప్రతిహత విజయాన్ని అందుకున్నారు. తొలిసారి కంటే భారీ మెజారిటీతో గెలిచారు. కెసీఆర్ అమలు చేసిన పథకాలు చాలా వరకూ పనిచేశాయి. దీంతో తెలంగాణాలో కెసీఆర్ కు రెండో సారి కూడా ప్రజలు పట్టం కట్టారు. పాలన పట్టించుకోవటం లేదనే విమర్శలు ఎదుర్కొన్న కెసీఆర్ నే తెలంగాణ ప్రజలు అంతిమంగా ఆదరించారు. కేంద్రంలో మోడీ సర్కారుదీ అదే పరిస్థితి. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను నానా కష్టాల పాటు చేశారు. జీఎస్టీ పెంపుతోపాటు..రాజకీయంగా వేధింపులు ఎక్కువయ్యాయని విమర్శలు జోరందుకున్నాయి.
దేశంలోని పార్టీలన్నీ కలసి మోడీని ఓడించాలని ప్రయత్నించాయి. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. కేంద్రంలో రెండవసారి కూడా ఎన్డీయేకు అప్రతిహత మెజారిటీతో దేశ ప్రజలు అధికారం కట్టబెట్టారు. తెలంగాణలో రెండవ సారి కెసీఆర్ కు ఛాన్స్ ఇచ్చారు. కేంద్రంలో మోడీకి రెండవ సారి ఛాన్స్ ఇచ్చారు. మరి అసలు తనకు తిరుగేలేదనుకున్న తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రజలు ఎందుకు అంతగా తిరస్కరించారు. నిత్యం సమీక్షలతో..రోజూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటూ దేశంలోనే తనంత ‘పనిమంతుడు’ లేడని చెప్పుకున్న చంద్రబాబుకు ఎందుకీ పరిస్థితి వచ్చింది?. పైగా తాను అధికారంలోకి వస్తే తప్ప అత్యంత కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావని చంద్రబాబు అంతగా చెప్పినా ప్రజలు ఎందుకు నమ్మలేదు?. అంటే ప్రజలకు..టీడీపీకి ‘కనెక్షన్’ కట్ అయిందనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లు చంద్రబాబు అసలు ప్రజలు ఏమి అనుకుంటున్నారు?. పార్టీ నాయకులు..క్యాడర్ మనసులో ఏమి ఉందో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. తాను ఏది అనుకుంటే అది చేశారు.
అన్ని స్కీమ్ ల్లోనూ ‘స్కామ్’లనే డిజైన్ చేశారు. ప్రతిపక్షంలో పదేళ్ళు ఉండి కూడా తాను మారాను అని చెప్పి అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే పాత పోకడలనే నమ్ముకున్నారు. ఎన్నో ఆశలు రేపిన రాజధాని అమరావతి విషయంలోనూ చంద్రబాబు ప్రజల అంచనాలను అందుకోవటంలో విఫలమయ్యారు. జన్మభూమి కమిటీలు..ఇసుక దందాలు..స్కాంలు ఇలా ఎన్నో కారణాలు. అందుకే అందరికీ రెండవసారి అధికారం ఇఛ్చినా..చంద్రబాబుకు మాత్రం ఏపీ ప్రజలు ‘నో’ చెప్పారు. చంద్రబాబు నాయుడు మార్చినన్ని సార్లు ఎవరూ మాట మార్చి ఉండరు. ఇది కూడా ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై అసహనం పెంచటానికి కారణం అయింది.