అధికారాలు ఉంటే అడగటం ఎందుకు?
‘నాకు అధికారాలు లేవా?. సీఎంకు అధికారాలు లేవంటారా?. ’ ఇదీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హంగామా?. నిత్యం పత్రికల్లో..టీవీల్లో ఇదే చంద్రబాబు ఓ నినాదంలా అందుకున్నారు. నాకు అధికారాలు లేవా? అంటూ నిత్యం ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. నిజంగా చంద్రబాబుకు అధికారాలు ఉంటే ఈ రచ్చ అంతా ఎందుకు?. ఆ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఒక్క ఆదేశంతో తీసేయవచ్చు కదా?. చంద్రబాబు తన అధికారం ఏంటో చూపించి దేశానికి ఓ దిశా, నిర్దేశం కూడా చేయవచ్చు కదా?. అలాగే మంత్రి సోమిరెడ్డి కూడా తన సమీక్షకు రాని అధికారులను ఒక్క కలం పోటుతో పక్కన పెట్టొచ్చుగా. అసలు నా సమీక్షను ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుందో...సీఎస్ అడ్డుకుంటారో చూస్తాను అంటూ సవాళ్ళు విసిరిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించిన మీటింగ్ కు ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోయినా ఇప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నారు.
చంద్రబాబుకు అధికారం ఉంటే తుఫాను ఫోనీ ప్రభావిత ప్రాంతాల్లో కోడ్ మినహాయింపు ఇవ్వాలని సీఈసీని కోరటం ఎందుకు?. చంద్రబాబు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా? మరి నేరుగా రంగంలోకి దిగి అక్కడే సమీక్షా సమావేశాలు పెట్టి..అధికారులకు నిమిషానికే ఆదేశం జారీ చేసి..సహాయక చర్యలను పరుగులెత్తించవచ్చు కదా?. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తన వ్యాఖ్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపదలచుకున్నారు. చంద్రబాబు పదే పదే తన వ్యాఖ్యల ద్వారా సీఎం పోస్టు ఔన్నత్యాన్ని కూడా తగ్గిస్తున్నారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంతో సీనియర్ అని చెప్పుకునే వ్యక్తి ఎన్నికల సమయంలో నిబంధనలు ఎలా ఉంటాయో తెలియదా? అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.